ఆ వీడియోతో వివాదానికి తెరదించిన దేత్తడి హారిక

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TSTDC) బ్రాండ్ అంబాసిడర్ నియామక వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల తాను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా హారిక ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఆ వీడియోతో వివాదానికి తెరదించిన దేత్తడి హారిక

dethadi harika shocking decision: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TSTDC) బ్రాండ్ అంబాసిడర్ నియామక వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల తాను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా హారిక ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. తన నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు హారిక. TSTDC బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై వస్తున్న విమర్శలతో మనస్తాపం చెందిన హారిక, పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

హారికను TSTDC బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు మహిళా దినోత్సవం రోజున ఆ సంస్థ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ప్రకటించారు. ఆ తర్వాత దీనిపై పెద్ద దుమారం రేగింది. ప్రభుత్వానికి కానీ, పర్యాటక శాఖ మంత్రికి కానీ, సీఎంవో అధికారులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా నియమించారని వార్తలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన మంత్రి, సీఎస్.. శ్రీనివాస్ గుప్తా నుంచి వివరణ కోరారు. అంతేకాదు TSTDC వెబ్‌సైట్ నుంచి హారిక ప్రొఫైల్‌ను కూడా తొలగించారు.

హారిక నియామకంపై పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిన్న మంత్రి మాట్లాడుతూ హారిక ఎవరో తనకు తెలియదని, ఆమెను నియమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వారిని అంబాసిడర్ గా పెట్టుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. త్వరలోనే మరో సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని చెప్పుకొచ్చారు. బ్రాండ్ అంబాసిడర్ ను నియమించే అధికారం ఉప్పల్ శ్రీనివాస్ గుప్తాకు లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.

దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు ఏం అర్హత ఉందని బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించి తెలంగాణ ఘనతని విశ్వవ్యాప్తం చేసిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస పేర్లను చాలా మంది సూచించారు. వాళ్లను కాదని హారికను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన హారిక, పదవి నుంచి తప్పుకుని ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.