అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్…దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్…దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

Glorious New Year Celebrations : చేదు, తీపి అనుభవాలు పంచిన ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలు రేకెత్తించే మరో వసంతం కాలు మోపింది. ఆంక్షలతో అప్పటి వరకూ ఇళ్లలో ఉండిపోయిన యువత నూతన ఏడాదికి స్వాగతం పలికింది. కొవిడ్‌ భయం వెంటాడుతున్నా, భౌతిక దూరం పాటిస్తూ.. షరతుల నడుమ ప్రజలు బెరుకుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు ప్రజలు. కొవిడ్‌ కొత్త స్ట్రెయిన్ భయం వెంటాడుతుండటంతో.. ప్రభుత్వం వేడుకలపై ఆంక్షలు విధించింది. అయినా, యువత ఉత్సాహాన్ని అడ్డుకోలేకపోయింది.

గతంతో పోలిస్తే.. ఈ ఏడాది వేడుకలు కొంచెం తగ్గాయనే చెప్పాలి. త్వరలో వ్యాక్సిన్‌ రాబోతుందన్న వార్త సఫలమై.. కొత్త ఏడాది అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తూ.. వేడుకలను జనం నిరాడంబరంగా జరుపుకున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయ్‌. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలందరూ టపాసులు కాల్చుతూ అట్టహాసంగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేకులు కోసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రధాన నగరాలు, పట్టణాలు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు కేసీఆర్‌, జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు మేలు కలుగాలని వారు కోరుకున్నారు. ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలని కోరారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది కష్టాలు అన్నింటినీ ఈ కొత్త ఏడాదిలో కోరారు. 2021లో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని వెల్లడించారు. ఆశావహ దృక్పథంతో 2021 నూతన వసంతంలోకి ప్రవేశిస్తున్న ప్రజలందరికీ పవన్ కల్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు.. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లు. సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ ఏడాది సేఫ్‌గా సాగాలని అనుకుంటున్నట్టు తెలిపారు. న్యూ ఇయర్‌ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయానికి చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి ఆలయంలో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కనువిందు చేసేలా టీటీడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. న్యూ ఇయర్‌ రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు లైటింగ్‌ ఏర్పాట్లను చూసి ముగ్దులవుతున్నారు.