అందులో పని చేశామని చెబితే చాలు, బీజేపీలో పదవులు ఖాయమట

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 03:05 PM IST
అందులో పని చేశామని చెబితే చాలు, బీజేపీలో పదవులు ఖాయమట

abvp: బీజేపీలో ఆర్ఎస్‌ఎస్‌ ప్రభావం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసిన వారికి పార్టీలో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అంతే కాదు సంఘ్ పరివార్‌లో పని చేసే వారికి కూడా పార్టీలో గుర్తింపు దొరుకుతుంది. పార్టీలో ఏదైనా పని కావాలంటే చోటా మోటా నాయకులు, కార్యకర్తలు తాను శాఖలో పని చేశానని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిందని అంటున్నారు. ఏబీవీపీలో పని చేశామని ఎక్కువ మంది చెప్పుకుంటున్నారట. ఏబీవీపీ కూడా సంఘ్ పరివార్‌లో భాగం కావడంతో అలా చెబుతున్నారని అంటున్నారు.




రాష్ట్ర బీజేపీలో ఏబీవీపీ నేతలకు అధిక ప్రాధాన్యం:
రాష్ట్ర బీజేపీలో ఏబీవీపీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో పని చేశామంటే చాలు పని అయిపోతుందని అంటున్నారు. రాష్ట్ర కమిటీలో అధ్యక్షుడు మొదలుకొని మెజారిటీ సభ్యులు ఏపీవీపీ నుంచి రావడమే దీనికి కారణమని చెబుతున్నారు పార్టీలో ఉన్న నాయకులు. విద్యార్థి పరిషత్‌లో పని చేశాం అంటే పదవి ఖాయమని బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇందుకు రుజువు కావాలంటే కమిటీని ఒకసారి పరిశీలిస్తే తేలిపోతుందని చర్చించుకుంటున్నారు.
https://10tv.in/moratorium-timely-emi-payers-may-be-rewarded/
ఏబీవీపీలో పని చేసిన వారికే పదవులు:
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కూడా విద్యార్థి నాయకుడు కావడంతో ఇతర పదవుల నియామకాల్లో కూడా ఏబీవీపీలో పని చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్‌. కమిటీ ప్రధాన కార్యదర్శుల్లో ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ఏబీవీపీలో కీలకంగా పని చేసిన వాళ్ళే. వీరితో పాటు పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి మంత్రిజీ ఏబీవీపీ నుంచే వచ్చారు. ఉపాధ్యక్షుల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, మనోహర్‌రెడ్డిది సైతం ఏబీవీపీలో ప్రస్థానం ప్రారంభించిన వారే అంటున్నారు. వీరితో పాటు ఎనిమిది మంది కార్యదర్శుల్లో ప్రకాశ్‌రెడ్డి కూడా విద్యార్థి పరిషత్‌లో పనిచేసి పార్టీలోకి వచ్చారు. యువ మోర్చా అధ్యక్షుడు భాను ప్రకాశ్‌, మైనార్టీ మోర్చా అఫ్సర్ పాషా, ఎస్సీ మోర్చా కొప్పు బాషాలు కూడా ఏబీవీపీ నుంచి వచ్చినవారేనట. జిల్లా అధ్యక్షులుగా కూడా ఏబీవీపీలో పని చేసిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు.

టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువమంది వారే:
విద్యార్థి పరిషత్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతలే ఎక్కువగా పట్టభద్రుల టికెట్ ఆశిస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఏబీవీపీలో పని చేసిన నాయకుడే. ఆయన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు. ఆయనతో పాటు విద్యార్థి దశలో ఏబీవీపీలో కీలకంగా పని చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు సైతం ఏబీవీపీలో పని చేసిన నేతలే. అంతేకాకుండా ప్రస్తుత హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం ఏబీవీపీలో కీలకంగా పని చేసిన నాయకుడే కావడంతో ఇప్పుడు ఏబీవీపీ పాత లీడర్లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.




బీజేపీ సీనియర్లు అసంతృప్తి:
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏబీవీపీలో పని చేయడంతో అక్కడి నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై సంఘ్ పరివార్‌లోని ఇతర శాఖల నుంచి వచ్చిన నేతలు గుర్రుగా ఉన్నట్లు పార్టీ కార్యాలయంలో చర్చ నడుస్తోంది. ఇటు పార్టీలో, అటు ప్రజా క్షేత్రంలో బరిలో దిగేందుకు అన్ని అవకాశాలు విద్యార్థి పరిషత్‌లో పని చేసిన నేతలకే ఇవ్వడం పట్ల బీజేపీలో పని చేసే సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని టాక్‌.

https://www.youtube.com/watch?v=iIrufEZ6V2Y