గ్రేటర్ వాసులకు ఇక పండగే.. నగరంలో ఉచితంగా మంచినీరు

గ్రేటర్ వాసులకు ఇక పండగే.. నగరంలో ఉచితంగా మంచినీరు

Hyderabad Greater people Free Water Scheme : గ్రేటర్ వాసులకు ఇక పండగే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా పథకం నేటి నుంచి అమలు కానుంది. బోరబండలో మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక హైదరాబాద్ ప్రజలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందించనున్నారు. గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకం నేటి నుంచే అమలు కానుంది. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. నగరవాసులకు నెలకు 20వేల లీటర్ల నీటిని అందించనున్నారు. ఈ పథకంతో సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా.. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ఈ పథకం ఎంతో మేలు చేకూర్చనుంది.

ప్రభుత్వం ప్రకటించినట్లుగానే జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. డిసెంబర్‌ నెలలో 20వేల లీటర్ల నీటిని వాడుకున్న వాళ్లు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే నల్లా కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే స్లమ్ ఏరియాలో వారికి మీటర్లు లేకున్నా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉచిత మంచినీటి సౌకర్యం ఢిల్లీలో అమలవుతుండగా.. ఆ తరువాత హైదరాబాద్‌కే దక్కింది.

నేడు బోరబండలోని రెహమత్‌నగర్‌లో ఉచిత మంచినీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తంగా కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని అమలుచేస్తుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో 10వేల ఆర్థిక సహాయం చేసి.. ఇప్పుడు ఉచిత మంచినీటితో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్‌ ప్రజలను మరింత ఆకట్టుకుంది.