అరకు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి.. షేక్ పేటలో విషాదఛాయలు

అరకు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి.. షేక్ పేటలో విషాదఛాయలు

Hyderabad residents killed in Araku accident : అరకులోయ బస్సు ప్రమాదం ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అరకు విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్‌పేట ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. షేక్‌పేటలోని వినాయక్‌నగర్, సీతానగర్‌కు చెందిన మూడు కుటుంబాలకు చెందిన చిన్నారులు, పెద్దలు మొత్తం 23 మంది ఈ నెల 10న ఉదయం 5.30 గంటలకు షేక్‌పేట నుంచి దినేశ్‌ ట్రావెల్స్‌ మినీ బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం వీరి బస్సు అరకు సమీపంలో లోయలో పడిపోవడంతో నలుగురు చనిపోయినట్లు, చాలా మందికి తీవ్రగాయాలైనట్లు ఇక్కడికి సమాచారం అందింది. దీంతో స్థానికంగా ఉన్న వారి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు. గాయపడిన వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు.

గతంలోనూ యాత్రలకు..
ఈ కుటుంబాల వారు గతంలోనూ అందరూ కలిసి ఏడుపాయల, వరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలకు ఆనందంగా వెళ్లి వచ్చారని…ఈసారి కూడా అలానే వస్తారని అనుకున్నామని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. మా వయసు మీద పడడంతో మమ్మల్ని ఇంటివద్దనే ఉండమన్నారని, వాళ్లు ఇలా ప్రమాదానికి గురవుతారని ఊహించలేదని వృద్ధులు ఆవేదన చెందారు. వ్యక్తిగత పనుల మీద ఇదే కుటుంబాలకు చెందిన నలుగురు చివరి నిమిషంలో పర్యటనకు వెళ్లలేదని తెలిసింది. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది బంధువులు హుటాహుటిన అరకు బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ట్రావెల్‌ ఏజెంట్‌కు ఫోన్‌కాల్‌ చేస్తే స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మృతుల వివరాలు తెలియక స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ఆదివారం తిరుగు ప్రయాణం..
రిటైర్డ్‌ బ్యాంక్‌ అధికారి నర్సింహారావు ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లారు. ఈ నెల 10న నగరం నుంచి బయలు దేరిన వీరు మొదట విజయవాడకు వెళ్లారు. అక్కడి నుంచి అమరావతి, పాలకొల్లు నరసింహాస్వామి దేవాలయం, అన్నవరం నుంచి అరకు వెళ్లారు. అరకు లోయ అందాలను తిలకించి తిరిగి సింహాచలం వెళ్తుండగా డముకు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే తమకున ఫోన్‌ చేసి ఆదివారం ఇంటికి వస్తామని చెప్పారని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చిందని బంధువులు కంట తడిపెట్టారు.

నిన్ననే ఫోన్‌లో చివరిసారిగా మాట్లాడింది
మా అక్క లత నిన్ననే చివరగా ఫోన్‌లో మాట్లాడింది. ‘టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాం. మేమంతా సందడిగా..ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నాం. నీవు రాత్రిపూట మా ఇంటివైపు వెళ్లి చూడు. ఆదివారం లోపు ఇంటికి వచ్చేస్తాం’ అని చెప్పింది. ఇంతలోనే శుక్రవారం ఈ ఘటన జరగడం తీవ్రంగా కలచివేసింది. అక్క ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాం అని బాధిత కుటుంబసభ్యుడు విజయ్‌కుమార్‌ అన్నారు.

ఫికర్‌ పెట్టుకోవద్దని చెప్పి..
‘టూర్‌ను ఆస్వాదిస్తున్నాం. మా మీద బెంగ పెట్టుకోకండి. పాటలు పాడుతూ.. వేళకు తింటూ పర్యటన సాగిస్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో తిరిగి వస్తాం’ అని తన భార్య శైలజ చెప్పిందని ఆమె భర్త జగదీశ్‌ రోధించారు. బస్సు ప్రమాదంలో శైలజ గాయపడ్డ సంఘటన తెలుసుకున్న ఆయన.. బస్సులో సీట్లు లేకపోవడంతో తాను ఈ పర్యటనకు వెళ్లలేకపోయానని వీడియాకు తెలిపారు.

రోజూ ఫోన్‌ చేసేవారు
రోజూ మాట్లాడే తమ బంధువులు ప్రమాదానికి గురికావడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని దయానంద్‌ వాపోయారు. మూడు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న నర్సింగ్‌రావు శుక్రవారం కూడా మాట్లాడాడని, భద్రంగానే ఉన్నామని చెప్పారని ఆయన అన్నారు. చిన్నారి శ్రీనిత్య బాగానే ఉందని, పాప తండ్రి బెంగ పెట్టుకోకుండా చూడమని తనను కోరారని, ఇంతలోనే చేదు వార్త వినాల్సిరావడం కలిచివేసిందన్నారు.

పర్యటన సాఫీగా సాగుతుంది.. రేపు వస్తున్నామన్నారు
‘అంతా బాగుంది. పర్యటన సాఫీగా సాగుతుంది. అరకు చేరుకున్నాం. రేపటిలోగా తిరిగివస్తాం’ ప్రమాదంలో చనిపోయిన సరిత చివరిగా కుమారుడితో చెప్పిన మాటలివి. క్షేమంగా తిరిగివస్తానని చెప్పి తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడం తమను శోకసంద్రంలో ముంచిందని ఆమె తనయుడు నవీన్‌ కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం ఉదయం తనతో మాట్లాడిన తల్లి రాత్రికి విగత జీవిగా మారడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. తీర్థయాత్రలను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం.. రేపు రాత్రి ఇంటికి చేరుకుంటాం. మీరేలా ఉన్నారని యోగక్షేమాలు తెలుసుకుందని ఆయన బోరున విలపించారు.

అరగంట ముందే మాట్లాడా..
‘ఘటనకు అరగంట ముందే మా బంధువు నందూతో ఫోన్‌లో మాట్లాడా. ఆ బస్సులో డ్రైవర్‌ను జర్నీ వద్దు..బస్సు ఆపేయమంటూ అందరూ వారిస్తూ లొల్లి చేస్తున్న సమయంలోనే నాతో మాట్లాడాడు. జర్నీ వద్దని ఎంత చెప్పినా డ్రైవర్‌ వినటం లేదని చెప్పాడు. ఇలా మాట్లాడినా అరగంటలోనే బస్సు లోయలో పడిపోయింది. నాతో ఫోన్‌లో మాట్లాడిన నందూ తీవ్రంగా గాయపడ్డాడు’ అని రామారావు అన్నారు.

ఐదుగురికి విమాన టికెట్లు
విశాఖ జిల్లా అరకు ప్రమాదబారిన కుటుంబసభ్యులను జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పరామర్శించారు. తక్షణమే విశాఖకు వెళ్లేందుకు ఐదుగురి విమాన టికెట్లను ఆయన సమకూర్చారు. మృతదేహాలను తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.