14రోజుల చికిత్సకు రూ. 17.5లక్షల బిల్లు, హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడీ

  • Published By: naveen ,Published On : July 30, 2020 / 08:27 AM IST
14రోజుల చికిత్సకు రూ. 17.5లక్షల బిల్లు, హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడీ

కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప్రాణం పోవడం ఖాయం. ఇప్పటికే ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. 14 రోజుల చికిత్సకు ఆ ఆసుపత్రి ఏకంగా రూ.17.5లక్షల బిల్లు వేయడం ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది.

రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు:
ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి 14 రోజుల చికిత్సకు రూ.17.5 లక్షల బిల్లు వేసింది. చంపాపేటకు చెందిన దంపతులకు జూలై 10న పాజిటివ్‌ తేలడంతో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల తర్వాత పరిస్థితి మెరుగ్గా ఉందని ఇద్దరినీ ఇంటికి పంపించారు. 15న ఆయాసంగా ఉండటంతో భర్త మళ్లీ అదే ఆసుపత్రిలో చేరారు. తర్వాతి రోజు భార్య ఆరోగ్యం విషమించడంతో బంజారాహిల్స్‌లోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె అక్కడ మంగళవారం మృతి చెందగా అదే రోజు భర్త కూడా కన్నుమూశారు.

బిల్లు కడితేనే మృతదేహం అప్పగింత:
అయితే అతనికి 14 రోజులపాటు చికిత్స అందించినందుకు రూ.17.5 లక్షలు బిల్లు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం బంధువులకు తెలిపింది. అప్పటికే రూ.8 లక్షలు చెల్లించడంతో మిగతా మొత్తం చెల్లించి మృతదేహం తీసుకెళ్లాలని సూచించింది. ఈ విషయాన్ని బంధువులు నిలదీయడంతో ఆసుపత్రి యాజమాన్యం దిగివచ్చి రూ.2 లక్షలు తీసుకొని మృతదేహాన్ని అప్పగించింది.

ఈ దోపిడీకి అడ్డుపడేదేలా?
కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల దోడిపీడి అడ్డు లేకుండా పోతోందని విమర్శలు ఉన్నాయి. అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా ట్రీట్ మెంట్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంత అమౌంటే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

కానీ, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలే కరోనా సంక్షోభంలో అంతా ఆర్థికింగా చికితిపోయి ఉన్నారు. ఇప్పుడు లక్షల లక్షల బిల్లులు వేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు.