తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ పెంచేనా?

తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ పెంచేనా?

PRC fitment for employees : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చర్చల్లో 14 ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. 45 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే.., రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది కాబట్టి, త్యాగాలకు సిద్ధపడాలని త్రిసభ్య కమిటీ విజ్ఞప్తి చేసింది. దీంతో సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో పీఆర్సీ నివేదిక సెగ‌లు రాజేసింది. ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 7.5 శాతం ఇవ్వాల‌ని బిస్వాల్ కమిటీ రిపోర్ట్‌ ఇవ్వడంతో.. ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. 31 నెలల పాటు పెండింగ్‌లో ఉంచిన తర్వాత వెలువడిన నివేదికపై ఉద్యోగులు భగ్గుమనడంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణం చర్చలు జరిపింది. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ… గుర్తింపు పొందిన సంఘాలతో మూడోరోజు కూడా విస్తృతంగా చర్చించింది.

టీఎన్జీవో, టీజీవో, యూటీఎఫ్, పీఆర్టీయూ, TTU, TRTF , STUలతో పాటు రెవెన్యూ, డ్రైవ‌ర్స్, నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు రోజులుగా జరిపిన చర్చలు ముగిశాయి. పీఆర్సీ రిపోర్ట్‌ అసంబద్ధం, అశాస్త్రీయంగా ఉందని సీఎస్‌ ఎదుట ఉద్యోగసంఘాల నేతలు తమ అసంతృప్తి వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని 9 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను బిస్వాల్ కమిటీ సిఫార్సులు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని వాపోయారు. ఫిట్‌మెంట్‌ 45 శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వేతనాలు సవరించాలని, మధ్యంతర భృతి ఇవ్వాలని పట్టుబట్టారు ఉద్యోగసంఘాల నేతలు. గ్రాట్యుటీ 16 లక్షలకే పరిమితం చేయడం తగదన్నారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా హెచ్‌ఆర్‌ఏ తగ్గించారని, ప్రభుత్వ కనుసన్నల్లో సిఫారసులు చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఫిట్‌మెంట్‌ ఇలా ఉండడం దారుణమని ఉద్యోగసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగసంఘాల డిమాండ్లను సావధానంగా విన్న త్రిసభ్య కమిటీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించింది. కరోనాతో ఆదాయం తగ్గినందున పీఆర్సీపై సర్దుకుపోవాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగసంఘాల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఫిట్‌మెంట్‌పై సీఎం నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఓ వైపు ఉద్యోగుల ఆగ్రహం, మరోవైపు విపక్షాల హెచ్చరికలతో.. ఫిట్‌మెంట్‌పై సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.