Gandhi Hospital : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు : గాంధీ హాస్పిటల్ ను మళ్లీ కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు కసరత్తు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిని మళ్లీ కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది.

Gandhi Hospital : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు : గాంధీ హాస్పిటల్ ను మళ్లీ కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు కసరత్తు

Gandhi Hospital

increasing corona cases in Telangana : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిని మళ్లీ కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు టిమ్స్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. జిల్లాల్లో కూడా మందుల కొరత రాకుండా చూడాలని DMHOలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెమిడిసివర్ వంటి మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర మందులు అన్ని ఆసుపత్రుల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు.

తెలంగాణలో కరోనా టెన్షన్ పెరుగుతోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24గంటల్లో 412 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో కరోనా కేసులు 4వందలు దాటడం ఇదే ప్రథమం. ఇంకో 8వందలకు పైగా రిపోర్టులు రావాల్సి ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటెల రాజేందర్‌…. పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో బెడ్లను సిద్ధం చేయాలని సూచించారు.

కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో… అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి బయటకు రావొద్దని తెలంగాణ వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో జిల్లాల్లో కేసుల తీవ్రత పెరుగకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే.. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో… 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. అంటే.. చాలామంది సూపర్ స్ప్రెడర్‌లుగా మారారు. దీంతో… కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అలాగే.. రోజుకు 50 నుంచి 70 కేసులు పెరుగుతుండటంతో పాజిటివిటీ రేటు పెరిగిందని అధికారులంటున్నారు. మాస్కులు దరించకపోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కేసుల సంఖ్య పెరగడానికి కారణంగా ఉంది.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భయపడాల్సిన పరిస్థితి లేనప్పటికీ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితి చేయిదాటుతుందని భావిస్తోంది. అందుకే పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ వంటి కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం నేడు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో దీనిపై చర్చించారు ఈటెల. స్కూళ్లు మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదోతరగతి లోపు స్కూళ్లు, హాస్టళ్లను మూసివేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులను పైక్లాస్‌కు ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. తెలంగాణ స్కూళ్లలో దాదాపు 7వందల మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

తెలంగాణలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి పాఠశాలలు, గురుకులాల విద్యార్థులే వాహకాలుగా మారుతున్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో కరోనా పాజిటివ్‌ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించడం లేదు. దీంతో వీళ్లంతా తరగతులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి వాహకాలవుతున్నారని వైద్యులు అంచనా వేశారు. అందువల్లనే ఈ నెల మొదటి నుంచి కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతోందని భావిస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు మూసివేయడం ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది.