సురభి వాణిదేవి గెలవాలంటున్న జనసేన శతఘ్ని

జనసేన పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ శతఘ్ని టీమ్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.

సురభి వాణిదేవి గెలవాలంటున్న జనసేన శతఘ్ని

JanaSena Shatagni

Jana Sena Shatagni : జనసేన పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ శతఘ్ని టీమ్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ఏపీలో మున్సిపాలిటి ఎన్నికలు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్న వేళ ఈ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురైన సురభి వాణిదేవి గెలవాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది జనసేన శతఘ్ని.

ఏపీలో బీజేపీలో కలిసి పని చేస్తామంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా ప్రకటించారు. అయితే తెలంగాణ విషయంలో పవన్‌ నుంచి అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. కానీ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామంటూ కొన్ని జిల్లాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన చీఫ్‌. ఆ మరుసటి రోజే ఆ పార్టీలో స్ట్రాంగ్ సోషల్‌ మీడియా హ్యండ్‌గా చెప్పుకునే శత్రుఘ్ని నుంచి ఈ తరహా ప్రకటన రావడం ఒకింత సంచలనం రేపింది. నేరుగా టీఆర్‌ఎస్‌కు మద్దతు అని ప్రకటించకపోయినా.. ఆ ట్వీట్‌ మిత్ర పక్షం బీజేపీకి చేటు చేస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీ నేతలు కలిసే ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ బీజేపీ పార్టీకి జనసేన మద్దతు ఇస్తుందనే భావన అందరిలో ఉంది. అయితే అనూహ్యంగా శతఘ్ని సేన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు కాకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణి గెలవాలని కోరుకుంటున్నట్టు పోస్ట్‌ పెట్టింది.