MIM తో కలిసి KCR కుట్రలు, విజయశాంతి కీలక వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 10:20 AM IST
MIM తో కలిసి KCR కుట్రలు, విజయశాంతి కీలక వ్యాఖ్యలు

Vijayashanthi Shocking Comments : టీఆర్ఎస్ పై నటి విజయశాంత కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక…బెంబేలెత్తిపోతున్నారని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఎంఐఎంతో కలిసి కుట్రలు చేస్తున్నారనంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు.



2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం విజయశాంతి చేసిన వరస ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు… క్షమించదని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోందని విజయశాంతి చేసిన పోస్టింగ్ వైరల్ గా మారాయి.



ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ? ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారిందని విమర్శలు చేయడం గమనార్హం. ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయన్నారు.



ఇటు పార్టీ మార్పుపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు విజయశాంతి. తన సోషల్‌ మీడియా ఖాతాలను కాషాయం కలర్‌తో నింపేశారు. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌లో రాహుల్‌గాంధీ ఫోటోను తొలగించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌కు దూరమైనట్లేనని తెలుస్తోంది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఆమె కమలం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నేపధ్యంలో ఆయన సమక్షంలోనే తిరిగి కమలం గూటికి చేరొచ్చని తెలుస్తోంది. పార్టీ మార్పుపై చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ విజయశాంతి మాత్రం అధికారికంగా స్పందించలేదు. విజయశాంతితో పాటు మరికొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది.