హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ ట్వీట్

ipl season : ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. BCCI తో పాటు ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేశారు. ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ ను కూడా ఒక వేదికగా చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు దుబాయి వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా..పలు నిబంధనల మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఈసారి మాత్రం భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలో నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తమ దగ్గర కరోనా ప్రభావం అధికంగా లేదని, ఇందుకు నమోదవుతున్న కేసులే నిదర్శనమన్నారు.

ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కేసులు తక్కువ అని… ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు, సహకారం తెలియచేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఐపీఎల్‌లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారని, హైదరాబాద్ క్రీడాకారుడు లేకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌కి స్టేడియం సామర్థ్యంలో సగం సీట్లలలో ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. దాదాపు రెండు నెలలకు పైగా జరిగే ఈ మెగా లీగ్‌ని ఇరవైకి పైగా నగరాల్లో నిర్వహిస్తారు.