జైలుకి పంపిందని గొడ్డలితో దాడి చేసిన కేసులో ప్రేమోన్మాది రాహుల్ అరెస్ట్

జైలుకి పంపిందని గొడ్డలితో దాడి చేసిన కేసులో ప్రేమోన్మాది రాహుల్ అరెస్ట్

meerpet police arrest rahul: హైదరాబాద్ మీర్ పేట్ టీచర్స్ కాలనీలో వివాహితపై గొడ్డలితో దాడి చేసిన కేసులో ప్రేమోన్మాది చెరుకు రాహుల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు అజయ్, సాకేత్ తో రెక్కీ నిర్వహించిన రాహుల్ వివాహితపై గొడ్డలితో దాడి చేశాడు. 2020 డిసెంబర్ 27న రాహుల్ పై వివాహిత మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టింది. దీంతో రాహుల్ పై 354డీ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 2021 జనవరి 2న అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాహుల్.. వివాహితపై గొడ్డలితో దాడి చేశాడు.

తనను జైలుకి పంపిందన్న కక్షతో వివాహితపై దాడి చేసి పారిపోయిన అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌ ని పోలీసులు బుధవారం(ఫిబ్రవరి 3,2021) ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారు గుర్రంగూడలో నివాసం ఉండే వివాహితపై సోమవారం(ఫిబ్రవరి 1,2021) సాయంత్రం (6.45 గంటలకు) నిందితుడు గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం పరారైన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చేపట్టి చివరికి అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి తుర్కయాంజాల్‌ రెవెన్యూ పరిధి టీచర్స్‌ కాలనీలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ గౌడ్‌ మూడేళ్లుగా ఒకరితో స్నేహం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి ఇంటికి రాకపోకలు చేస్తూ అతని భార్య (27)పై మనసుపడ్డాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన స్నేహితుడి భార్యకు తరచూ ఫోన్లు, మెసేజ్ లతో ప్రేమించమంటూ విసిగించేవాడు. భర్త స్నేహితుడు కావడంతో ఆమె ఎవరికీ చెప్పకుండా కొన్నాళ్లు బాధపడింది.

కొన్ని రోజులకు ఆమె భర్తకు, రాహుల్‌గౌడ్‌కు ఓ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇంటికి రావొద్దంటూ రాహుల్‌గౌడ్‌ను హెచ్చరించారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు 2020 డిసెంబర్ లో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

కొద్దిరోజుల్లోనే బెయిల్‌పై బయటికొచ్చిన రాహుల్.. తనపై కేసు పెట్టి పరువు తీసిందనే కోపంతో ఆమెను అంతం చేయాలని అనుకున్నాడు. రెండు రోజులు రెక్కీ నిర్వహించాడు. సోమవారం(ఫిబ్రవరి 1,2020) సాయంత్రం 6.30 గంటలకు చిన్నారిని ఎత్తుకున్న బాధితురాలు ఇంటి బయట మరో మహిళతో మాట్లాడుతుండగా స్కూటీపై వచ్చిన రాహుల్‌ దిగి దిగగానే తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆమె భయంతో అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. కుటుంబ సభ్యులు బయటకు రావడంతో నిందితుడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. రాహుల్ దాడిలో గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కుడి భుజం, కుడి మోచేయి, అరచేయిపై గాయాలు అయ్యాయి. చేతి వేళ్లు విరిగాయి. రాహుల్ దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న మహిళ భయాందోళనకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.