తెలంగాణలో హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి.

తెలంగాణలో హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం

MLC election campaign in Telangana : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి. నేతల విమర్శలు.. ఎదురు దాడులతో తెలంగాణ పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి.. మా మౌనం గోడకు వేలాడే తుపాకీలాంటిదంటూ బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్‌.. అన్నట్టుగానే ఇప్పుడు తూటాలు పేలుస్తున్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలవలేని చోట పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీట్‌ ఇచ్చారంటూ బండి సంజయ్‌ విమర్శిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొలేకే పీవీ ఫోటోలను పట్టుకుని టీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. గోడకు వేలాడదీసిన తుపాకి కూడా సైలెంట్‌గానే ఉంటుందని.. వాడటం మొదలు పెడితే చీల్చిచెండాడుతుందంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ నేతలు మిడిసిపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ నేత లక్ష్మణ్‌ మండిపడ్డారు. తమ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అసహనంతో కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్‌ ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గత ఆరేళ్లలో తెలంగాణ …. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు, వివిధ రకాల పన్నుల రూపంలో 2లక్షల 72వేల 926 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. అయితే ఇందులో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం లక్ష 40వేల 329 కోట్ల రూపాయలేనన్నారు. దీనిని బట్టి ఎవరు ఎవరికి ఇచ్చారో బండి సంజయ్‌ చెప్పాలంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ హాయంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను కూడా ఎన్డీఏ సర్కార్‌ రద్దు చేసిందని.. ఎందుకు రద్దు చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో కేంద్రం పెద్దలున్నారని ఫైరయ్యారు కేటీఆర్‌. ఏదేమైనా బీజేపీ అధికారంలోకి వచ్చాక జీడీపీ మాత్రం బాగా పెరిగిందంటూ కేటీఆర్‌ సెటైర్లు వేశారు.

జీడీపీ అంటే.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ అని.. వాటి రేట్లు మాత్రం ఎన్డీయే సర్కార్‌ హాయంలో చుక్కలనంటాయన్నారు. మొన్నటి వరకు విమర్శలపై సైలెంట్‌గా ఉన్న కేటీఆర్‌.. ఇక ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు.. అంతేకాదు.. విపక్షాలు చేసే విమర్శలకు కేటీఆర్‌ లెక్కలతో సహా జవాబులు చెబుతున్నారు.