Nomula Bhagat : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, నోముల భగత్ ఎవరు ?

Nomula Bhagat : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, నోముల భగత్ ఎవరు ?

Nomula (1)

Nagarjuna Sagar By-election : నాగార్జున సాగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. ఆయనకు బీఫాం కూడా అందించారు. యాదవ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినా… మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ నే కేసీఆర్ బరిలోకి దించుతున్నారు.. ప్రచారం కోసం నోముల భగత్‌కు పార్టీ తరపున 28 లక్షల రూపాయల చెక్‌ను భగత్‌కు అందించారు కేసీఆర్‌.

నోముల భగత్‌.. 1984 అక్టోబర్‌ 10న జన్మించారు. నోముల భగత్‌ ఉన్నత విద్యావంతుడు. బీ.ఈ., ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 2008 నుంచి 2010 వరకు సత్యం టెక్నాలజీస్‌లో జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేశారు. 2010 నుంచి 2012 వరకు విస్టా ఫార్మాస్యూటికల్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేశారు. 2014 నుంచి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 2014 నుంచి టీఆర్‌ఎస్‌ క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2014 సాధారణ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చరుగ్గా పని చేశారు. 2014 నుంచి స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రీయాశీలకంగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నోముల ఎన్‌ఎల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఫౌండేషన్‌ ద్వారా పేదల విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే బలహీనవర్గాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి జీహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రభావం తగ్గిన అధికార టిఆర్ఎస్ కు సాగర్‌ బై పోల్ లో గెలుపు అనివార్యమైంది. అటు వరుసగా ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ నాగార్జునసాగర్‌లో కూడా పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇప్పటికి ఏడుసార్లు విక్టరీ సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఎనిమిదో సారి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.