తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దు, ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం

తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దు, ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం

ou jac warning for sharmila: తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఓయూ(ఉస్మానియా యూనివర్సిటీ) జేఏసీ తీవ్రంగా స్పందించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దని చెప్పింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం అని జేఏసీ నేతలు చెప్పారు. ఏపీలో చేయలేని పెత్తనం తెలంగాణలో ఎందుకని వారు షర్మిలను ప్రశ్నించారు. అధికార దాహం కోసం తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే ఓయూ విద్యార్థి జేఏసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని వారు హెచ్చరించారు.

తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. పార్టీ విషయంలో, రాజకీయం విషయంలో తన దారి తనదే అని షర్మిల చెప్పారు. పార్టీ ఏర్పాటు సాహసోపేతమైన నిర్ణయం అన్న షర్మిల.. తమ అన్నాచెల్లెళ్ల అనుబంధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని షర్మిల అన్నారు. రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా అని అడిగారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్న షర్మిల, రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని తన నమ్మకం అన్నారు. తాను తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. రాజన్న సువర్ణ పాలన తెచ్చేందుకే వచ్చానన్నారు. జగన్.. ఏపీలో పని చేస్తున్నారని.. తాను తెలంగాణకు కమిటెడ్ గా పని చేయాలనుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ పై అభిమానం చెక్కు చెదరలేదన్న షర్మిల.. వైఎస్ పాలనలో రైతు రాజులా బతికాడన్నారు.