Revanth Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు.

Revanth Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

revanth reddy brand in congress first list

TPCC Chief Revanth Reddy: కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హవా చాటుకుంటున్నారా? కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా? తొలి జాబితాలోని 55 మంది అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారికి టికెట్లు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించింది రేవంత్‌రెడ్డేనా? అందుకే టికెట్లు దక్కని వారు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా ?

కాంగ్రెస్ రాజకీయాలకు భిన్నంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హవా నడుస్తోంది. తాను అనుకున్నవారికే టికెట్లు ఇప్పించుకుంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తనదైన శైలిలో దూకుడు మీద సాగుతున్నారు. తనను నమ్ముకున్నవారికి.. తన మాటపై పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇప్పించకోవడం ద్వారా అధిష్టానం వద్ద తన పరపతి చాటుకున్నారు రేవంత్‌రెడ్డి.. సర్వేలు, పీసీసీ, స్కీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఇలా అభ్యర్థుల ఎంపికలో రకరకాల బృందాలు.. అనేక వడబోతల తర్వాత కూడా తనవారికి న్యాయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ఏంటో చెప్పకనే చెప్పేశారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇప్పించేందుకు రేవంత్ ప్రయత్నిస్తుండటంతో మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా కొత్త వారికి ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించలేని అనివార్యతలో పడిపోతున్నారనే టాక్ విన్పిస్తోంది.

కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు. అభ్యర్థుల ఎంపికలో కీలకమైన స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా రాష్ట్రం నుంచి ఐదుగురు నేతలు ఉన్నా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరే చక్రం తిప్పారనే టాక్ నడుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉన్నా రేవంత్ రెడ్డి చెప్పినవారికే టికెట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ కోరినట్లు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలు చేయడంతో తమకు టికెట్లు దక్కలేదని ఎక్కువ మంది రగిలిపోవడం పార్టీలో రేవంత్ హవాను తెలియజేస్తోందంటున్నారు పరిశీలకులు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, ఢిల్లీ పెద్దల సపోర్టు రేవంత్‌కే ఉండడంతో తన అనుకున్న వాళ్ళ అందరికి టికెట్ ఇప్పించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు.. మరో నలుగురు నేతలు రాజీనామా!

తొలి జాబితాపై రేవంత్ ముద్ర స్పష్టంగా కనిపించడంతో అభ్యర్థుల లిస్టు విడుదలైన వెంటనే నిరసనలు ఎక్కువయ్యాయని అంటున్నారు. రేవంత్ వర్గానికే ఎక్కువ టికెట్లు దక్కాయని ఆయన ప్రత్యర్థులు రగిలిపోవడమే కాక.. గాంధీభవన్లో నిరసనలకు దిగారు. టికెట్లు దక్కించుకున్న 55 మందిలో 11 మంది కొత్తగా వచ్చిన వారేనంటూ విమర్శలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పట్ల వినయ విధేయత ప్రకటించిన వారు.. రేవంత్‌రెడ్డి హామీతో పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు ఇప్పించుకున్నారని కొన్ని నియోజకవర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్లా? పొంగులేటి కూడా ఒక లీడరేనా- నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు

ముఖ్యంగా గద్వాల, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు పీసీసీ చీఫ్ పై తీవ్రంగా రగిలిపోతున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తంచేయడమే కాకుండా.. ఓ స్థాయి దాటి డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా కాంగ్రెస్లో రేవంత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా సీనియర్లతో సయోధ్యకు ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి.. వర్గపోరుకు ఫుల్‌స్టాప్ పెట్టడంతోపాటు ఇప్పుడు టికెట్ల పంపిణీలోనూ తన మార్కు చాటుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. అటు రేవంత్ పై విమర్శలు చేసిన నాయకులను సైతం క్రమశిక్షణ కమిటీ తక్షణమే సస్సెండ్ చేయడం కొసమెరుపు.