Telangana Budget 2023 Live Update : 2023-24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396కోట్లు.. ఏఏ రంగానికి ఎన్ని కోట్లంట్లే.. లైవ్ అప్‌డేట్స్
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్‌లను సభ ముందుకు తీసుకొచ్చారు.

Telangana Budget 2023 Live Update : 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్‌లను సభ ముందుకు తీసుకొచ్చారు. విద్య, వైద్య, ఇరిగేషన్‌తో పాటు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు..
LIVE NEWS & UPDATES
-
Telangana Budget2023
-
TelanganaBudget2023
-
Telangana Budget2023
-
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ ..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని మంత్రి హరీష్ రావు అన్నారు. 2017 -18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం గర్వకారణం అని మంత్రి అన్నారు. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉందని మంత్రి అన్నారు.
-
అసెంబ్లీ బుధవారంకు వాయిదా..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,90,396 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఆయా రంగాలకు చేసిన కేటాయింపుల వివరాలను మంత్రి సభలో వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం మధ్యాహ్నం 12.14 గంటల వరకు సాగింది. సుమారు రెండు గంటల పాటు బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి చదివి వినిపించారు. 12.14 గంటలకు మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగియడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను బుధవారం ఉదయంకు వాయిదా వేశారు.
-
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శుభవార్త..
గ్రామీణ అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సంస్కరణల వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీ ఆమోదాలకోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
-
న్యాయశాఖకు రూ. 1,665 కోట్లు..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం కోసం వందకోట్ల నిధిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ నిధులతో న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ 22వేల మంది న్యాయవాదుల కోసం ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలను ప్రారంభించిందని అన్నారు. ఈ బీమా పథకాల వల్ల 8,053 మంది న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు 38.45 కోట్ల మేర లభ్ది పొందంటం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలోని న్యాయసేవలను సత్వరం అందించేందుకు జిల్లాల సంఖ్యకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. అదేవిధంగా రూ. 1,050కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
-
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు ప్రభుత్వం మైనార్టీలకు ఏడాదికి 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో 1,286 కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని మంత్రి హరీష్ రావు అన్నారు.
ముస్లీం మైనార్టీ ఆడ పిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని 2014 నుంచి అమలు చేస్తుందని, గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో 2,32,713 మంది పెళ్లిళ్లకు 1903 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా 150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం 450 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 270 కోట్లు ఖర్చు చేయడానికి ప్రాతిపాదించినట్లు తెలిపారు. ఇది 2022-23 సంవత్సరానికి కన్నా 239 కోట్లు ఎక్కువ అని తెలిపారు. అదేవిధంగా పేద ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 20వేల కుట్టు మిషన్లు ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక 203 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వీటిని మైనార్టీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసిందని తెలిపారు. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
-
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌కు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు అన్నారు. రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న మీడియా అకాడమీ భవన నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నారు.
ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టివిటీకోసం రూ. 500 కోట్లు
న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు.
-
మహిళా, శిశు సక్షేమానికి 2,131 కోట్లు ..
మహిళ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు ఈవ్ టీజింగ్‌ను అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని కట్టడి చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం సివిల్, పోలీస్ ఉద్యోగాలనియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33శాతం రిజర్వేషన్లను విధిగా పాటిస్తుందని మంత్రి అన్నారు. ఆర్ముడ్ రిజర్వు పోలీస్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో వారి అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వినూత్నంగా వీహబ్ ను నెలకొల్పిందని తెలిపారు. మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిందని, దీనివల్ల మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించిందని అన్నారు. మహిళా శిశు సక్షేమానికి 2023 -24 బడ్జెట్‌లో 2,131 కోట్లు ప్రతిపాదించటం జరిగిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.
-
కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. వెయ్యి కోట్లు..
తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయటం జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
-
రుణమాఫీ పథకానికి 6,385 కోట్లు ..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి హరీష్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలతో పాటు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
-
బడ్జెట్‌లో ఆయా రంగాలకు కేటాయింపులు ఇలా..
వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు.
నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు.
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు.
ఆయిల్ ఫామ్‌కు 1000 కోట్లు
ప్రజాపంపిణీకి 3,117 కోట్లు
ఆసరా పింఛన్ల కోసం 12,000 కోట్లు
దళిత బంధుకు 17,700 కోట్లు
గిరిజన సంక్షేమంకు 15,233 కోట్లు
బీసీ సంక్షేమంకు 6,229 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకానికి 3,210 కోట్లు
మహిళా శిశు సంక్షేమంకు 2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి 2,200 కోట్లు
తెలంగాణ హరిత హారంకు 1,471 కోట్లు
వైద్యారోగ్య శాఖకు 12,161 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు 31,426 కోట్లు
పురపాలక శాఖకు 11,372 కోట్లు
ఇండస్ట్రీకి 4,037 కోట్లు
శాంతి భద్రతలకు 9,599కోట్లుడబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12వేల కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1,463 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేసన్ల శాఖకు రూ. 366 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
-
వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం..
వైద్యం, విద్య రంగాలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు.
విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు కేటాయించారు.
-
బడ్జెట్ లో వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు భారీగా కేటాయింపులు..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు కేటాయించింది.
-
రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
2023 - 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
రాష్ట్ర బడ్జెట్ 2,90,396 కోట్లు.
రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు
-
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు.
-
Telangana Budget
ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభకు చేరుకున్న ఆయన మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. వారికి బడ్జెట్ పత్రులను అందజేశారు. శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
-
అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. 10.30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి.
-
జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ..
అసెంబ్లీలో మరికొద్దిసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బడ్జెట్ ప్రతులతో జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ పూజా కార్యక్రమంలో హరీష్‌రావు వెంట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
-
Minister Harish Rao
బడ్జెట్ ప్రతులతో ఇంటి నుంచి బయలుదేరిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని, అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందని తెలిపారు. మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు కేబినెట్ తో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందని హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా సమపాళ్లలో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పారు.
-
తెలంగాణ అసెంబ్లీలో మరికొద్ది సేపట్లో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తన ఇంటి నుంచి బయలుదేరి అసెంబ్లీకి వెళ్లే ముందు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తారు.