Rythu Bandhu : నేటి నుంచి రైతుబంధు పంపిణీ

తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్‌లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.

Rythu Bandhu : నేటి నుంచి రైతుబంధు పంపిణీ

Rythu Bandhu Kcr

Rythu Bandhu : తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్‌లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. రైతుబంధుకు గతంలో కంటే ఈసారి 2లక్షల 81వేల మంది రైతులు పెరిగారు. రైతుబంధు పంపిణీని క్రమబద్ధంగాచేయాలని అధికారులు నిర్ణయించారు. ఎకరం భూమి గల రైతులకు తొలిరోజు (మంగళవారం) రైతుబంధు నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత రెండెకరాల భూమి గల రైతులకు ఇస్తారు. 25వ తేదీ వరకు అర్హులైన ప్రతిరైతుకు రైతుబంధు అందిస్తారు.  ఈ పధకం ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.

నూతనంగా 66వేల 311ఎకరాల భూమి ఈ పథకంలో చేరింది. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈసారి రైతుబంధు లబ్దిదారుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4లక్షల 72వేల 983 మంది రైతులు ఉన్నారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి బడ్జెట్‌లో 14వేల 656 కోట్లకు పైగా విడుదల చేశారు.

ఈ వానాకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్‌లో 14వేల 800 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్‌ ఎక్కడా వెనక్కు తగ్గకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దీని వలన తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు.

2018 వాననాకాలం సీజన్‌లో సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం ప్రవేశపెట్టే నాటికి దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదు. ఆ తర్వాత మన రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు వివిధ పేర్లతో రైతుకు పెట్టుబడిసాయం అందిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో రైతుకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌.. ఎవుసం సాఫీగా సాగేందుకు, పెట్టుబడి కోసం రైతు గోస పడకుండా చూసేందుకు రైతుబంధు నిధులను సీజన్‌కు ముందే అందిస్తున్నారు.

రైతుబంధు సాయం పకడ్బందీగా అమలయ్యేదుకు కలెక్టర్లకు జీరో ఫైల్‌ పెండింగ్‌ టార్గెట్‌ పెట్టింది ప్రభుత్వం. కలెక్టర్లు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో తహశీల్దార్లకు టెన్షన్‌ పట్టుకుంది. ఫ్యూచర్‌లో ఎన్ని వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది.

తహశీల్దార్‌గా, రిజిస్ట్రార్‌గా ఎమ్మార్వోలు డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నారు. దీనికి తోడు ధరణి క్లియరెన్స్‌ ఉండటంతో చాలావరకు దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. రైతు బంధు పంపిణీ కోసం సర్కార్ జీరో ఫైల్‌ పెండింగ్ టార్గెట్ పెట్టింది. తహశీల్దార్ల డిజిటల్‌ సంతకాలు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది. దీంతో కలెక్టర్లు..తహశీల్దార్ల డిజిటల్‌ సంతకాలను జెట్‌ స్పీడ్‌తో పెట్టేశారు. దీంతో తహశీల్దార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారు.

రైతు బంధు కోసం త‌హ‌సీల్దార్ సంత‌కాల‌తో పాస్ బుక్ వ‌స్తుండ‌టంతో.. ఎమ్మార్వోలు ఇబ్బంది ప‌డుతున్నారు. ముఖ్యంగా విరాస‌త్, పౌతీ ద‌ర‌ఖాస్తుల విష‌యంలో క్షేత్ర స్థాయిలో ప‌రీశీలించ‌కుండా క‌లెక్టర్ లు క్లియ‌రెన్స్ ఇచ్చార‌ని తహశీల్దార్లు ఆరోపిస్తున్నారు. భ‌విష్యత్‌లో వారు కోర్టుల‌కు వెళితే.. తాము తిరగాల్సి వస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. హడావిడిగా ఫైళ్లు క్లియరెన్స్‌ చేయడం వల్ల జరగబోయే పరిణామాలకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.