వింత బోనాలు : ఐదేళ్లకోసారి ఊరంతా బంధనం..పూజలు పూర్తయ్యే వరకు గ్రామస్థులు పాచి ముఖం కడగరు, చీపురు పట్టరు

వింత బోనాలు : ఐదేళ్లకోసారి ఊరంతా బంధనం..పూజలు పూర్తయ్యే వరకు గ్రామస్థులు పాచి ముఖం కడగరు, చీపురు పట్టరు

Telangana Variety Bonalu At Peddapalli District Suglampally Villege (1)

variety bonalu at suglampally villege : ప్రపంచ వ్యాప్తంగా జీవించే ప్రజల్లో బిన్న సంప్రదాయాలు..విభిన్న ఆచారాలు. ఇంకెన్నో నమ్మకాలు. అవి నమ్మకాలు కావచ్చు..మూఢ నమ్మకాలు కావచ్చు. అటువంటి ఓ వింత విచిత్ర ఆచారం ఏనాటినుంచి వస్తోంది మన తెలంగాణలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో. ఈ గ్రామాన్ని గ్రామస్థులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి బంధనం చేస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించే విషయంలో ఊరు ఊరంతా ఒకే మాటమీద ఉంటుంది. కలిసి కట్టుగా గ్రామం మొత్తాన్ని బంధనం చేస్తారు. తెల్లవారు ఝామున వింత వింత పూజలు చేస్తారు. ఈ పూజలు పూర్తి అయ్యేంత వరకూ గ్రామస్తులెవ్వరూ పాచి ముఖం కూడా కడగరు. వాకిళ్లు ఊడవరు..కళ్లాపి చల్లరు. సుగ్లాంపల్లిలో తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈనాటికి గ్రామస్తులంతా ఒకేమాటమీద నిలబడి అమలు చేస్తున్నారు.

సుగ్లాంపల్లి గ్రామంలో ప్రతి ఐదేళ్లు ఒకసారి..జరిగే గ్రామ దేవతల పూజల కోసం ఆ ఊరు ఊరంతా కలిసి కట్టుగా ఉంటుంది. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు, గొడ్డుగోదా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐదేళ్లకోసారి పెద్దఎత్తున పోచమ్మకు కొలుపు చేస్తారు. దానికి సంబంధించిన పూజలు పూర్తయ్యే వరకు ఊరు ఊరంతా పాచి ముఖం కడగరు, చీపురు పట్టి వాకిలి ఊడవనే ఊడవరు. కళ్లాపి చల్లరు. ఇది సుగ్లాంపల్లి ఊరిలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. వినడానికి వింతగా అనిపించినా ఈ తంతంగానికి ఓ పండుగ వేదికగా ఉంటుంది. గ్రామ దేవతలైన పోచమ్మ, భూలక్ష్మి జాతర సందర్భంగా గ్రామస్తులంతా ఈ ఆచారాన్ని పాటిస్తారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే గ్రామ దేవత పోచమ్మ, భూలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమ గ్రామంలో కరోనా మహమ్మారి సందర్భంగా ఎవ్వరినీ ఈ మహమ్మారి సోకకూడదని భారీగా ఎత్తున అమ్మవారికి పూజలు చేశారు గ్రామస్తులు. ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లు, బోనాలు, శివసత్తులు పూనకాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మా గ్రామాన్ని సల్లగా చూడు తల్లీ అంటూ మొక్కుకున్నారు.

ఈ వేడుకకు ఊరు ఊరంతా ఒక రోజు ముందే బంధనం వేస్తారు. ఈ గ్రామంలోకి ఎవరూ రాకూడదు. ఈ గ్రామం నుండి ఎవ్వరూ బైటకు వెళ్లకూడదు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నాసరే. కనీసం పొరుగు గ్రామానికి వెళ్లరు. దీంట్లో భాగంగా పోచమ్మ అమ్మవారి ఆలయానికి గ్రామంలోని ప్రతీ ఇంటినుంచి భోనం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఆరోజు తెల్లవారుజామున భూలక్ష్మి విగ్రహాల వద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే తంతులో.. పూజారులు గొర్రెపిల్ల బలి ఇస్తారు. గావుపట్టి రక్తతర్పణం చేసి అమ్మవార్లను కొలుస్తారు. అమ్మలు ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇక్కడే ఉంది గ్రామస్తుల అసలైన ఆచారం. ఈ పూజా కార్యక్రమాలు ముగిసే వరకు…ఎంత ఆలస్యం అయినా సరే గ్రామంలో ఏ ఇంటి ముందు చీపురు పట్టరు. వాకిలి ఊడవరు, కళ్ళాపి చల్లరు. ఈ పూజా తంతు ముగిసిన తర్వాతే గ్రామంలో ఆడవాళ్లంతా తమ తమ ఇళ్లముంది వాకిళ్లు ఊడ్చి, పేడతో చిక్కగా కళ్లాపి చల్లి, ముగ్గులు వేసి ఎప్పటిలాగా ఇళ్లలోకి వస్తారు గ్రామ ప్రజలు. కాగా..కరోనా మహమ్మారి తాండవిస్తున్న ఈ క్రమంలో ప్రజలు బంధనాల వేడుక జరుపుకోవటానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. కానీ అమ్మవార్లకు బోనం వండి సమర్పించటం మాత్రం మానలేదు. ఇంటికొకరు వచ్చి భౌతిక దూరం పాటిస్తూ పోచమ్మ, భూలక్ష్మి మాతలకు మొక్కులు చెల్లించుకున్నారు గ్రామ ప్రజలంతా…కరోనా సోకకుండా గ్రామాన్ని కాపాడాలని మొక్కుకున్నారు.