Self-lockdown : కరోనా భయం, స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్న గ్రామాలు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు.

Self-lockdown : కరోనా భయం, స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్న గ్రామాలు

self-lockdown

Telangana Villages : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దుకాణ సముదాయాలు, మార్కెట్ల కార్యాకలపాలు, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ టెన్షన్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఊహించ‌ని వైరస్‌ వ్యాప్తి విధంగా పెరిగిపోతోంది. సెకండ్ వేవ్‌లో కరోనా సైలెంట్‌గా రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. నిన్నమొన్నటి వ‌ర‌కు ప‌ట్టణ ప్రాంతాల్లో మాత్రమే కేసులు అధికంగా క‌నిపించాయి. కానీ ఇప్పుడు ప‌ల్లెల్లోకి చొచ్చుకొచ్చిందీ మ‌హ‌మ్మారి. ఏకంగా లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితుల‌ను తీసుకొచ్చింది.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్‌పల్లి, గొర్రెపల్లి గ్రామాల్లో లాక్‌డౌన్ విధిస్తూ పంచాయితీ పాలకవర్గాలు తీర్మానం చేశాయి. ఈ నెల 20 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘింస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని సిరిపూర్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మెట్‌పల్లి డివిజన్‌లోని నాలుగు గ్రామాలు కట్టడిలో ఉన్నాయి.

ఇక కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గ్రామంలో 30 మందికిపైగా కరోనా బారినపడ్డారు. వారం రోజుల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిని కలిసిన వారికీ వైరస్ సోకింది. దీంతో గ్రామంలోఈ నెల 21 వరకు లాక్‌డౌన్ విధించారు.

మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోనూ కరోనా కల్లోలం కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో బోథ్‌లో కేసులు పెరుగుతున్నాయి. ఐదు రోజుల్లో రెండు వందల వరకు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మండల వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో.. స్థానిక వ్యాపారస్థులతో సమావేశం నిర్వహించి కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మాస్క్‌, భౌతిక దూరం తప్పక పాటించాలని తీర్మానం చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కరోనా మరోసారి ప్రతాపం చూపిస్తోంది. ఒక్క రోజులోనే 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిక్కడ. మోపాల్‌లో ఎనిమిది మందికి వైరస్ సోకింది. దీంతో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ అమలులోకి తెచ్చారు. గ్రామ తీర్మానం ఉల్లంఘిస్తే 5 వందల నుంచి ఐదు వేల వరకు ఫైన్ విధిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా.. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. గ్రామాలకు గ్రామాలు లాక్‌డౌన్‌ అవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో.. గ్రామస్తులే స్వచ్ఛందంగా ఆంక్షలు పెట్టుకుంటున్నారు.

Read More : Covid – 19 Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం, ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కేసులు