Hyderabad : హైదరాబాద్‌ ప్రజలకు ప్రతియేటా తప్పని వరద కష్టాలు

హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అప్పటికి, ఇప్పటికి అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో... ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు.

Hyderabad : హైదరాబాద్‌ ప్రజలకు ప్రతియేటా తప్పని వరద కష్టాలు

Hyderabad

people suffering from floods : సాధారణ వర్షాలు పడితేనే హైదరాబాద్‌ నరకాన్ని తలపిస్తుంది. ఇక. కుండపోత వాన ఎడతెరిపిలేకుండా కురిస్తే ఊహించడమే కష్టమవుతుంది. తాజాగా గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటినుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. మరోవైపు.. నగరంలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరిక జారీ చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గతేడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి నగరం సాగరమైంది. వీధులు నదులయ్యాయి. దారులు గోదారులయ్యాయి. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు… బతుకమ్మలను తలపించాయి. మహానగరంలో ఎటు చూసినా ఇప్పటికీ ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఆనాటి భయం హైదరాబాద్ వాసులను ఇంకా వెంటాడుతోంది. ప్రస్తుతం దంచికొడుతున్న వానలు, వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. దీంతో చినుకు పడితే చాలు నగర ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. మరోసారి అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. మరోవైపు గతేడాది అనుభవాలతోనూ గుణపాఠం నేర్వని జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు… వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Gulab Effect : హైదరాబాద్‌కు గులాబ్‌ గండం.. నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్ బండ్లగూడ లేక్‌ కాలనీ వాసులను వాన కష్టాలు వదలడం లేదు. వర్షం వచ్చిందంటే పక్కనే ఉన్న చెరువు నిండి .. ఆ నీరంతా కాలనీని ముంచెత్తుతోంది. చెరువులో నీటికి తోడు సివరేజ్‌ వాటర్‌ కూడా కలవడంతో స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. నాలాల అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టినా .. అవి పూర్తి స్థాయితలో కాకపోవడంతో .. సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.

హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అప్పటికి, ఇప్పటికి అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో… ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు. అయితే.. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది వారి పరిస్థితి. నగరంలో ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేసినా.. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం.. సర్కార్‌ స్పీడ్‌కు బ్రేకులు వేస్తోంది. మరోసారి ముంపు సమస్య తలెత్తకుండా ప్రభుత్వం… గతేడాదే 858కోట్ల రూపాయలతో అనుమతులు మంజూరు చేసినా జీహెచ్ఎంసీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికీ పనులు ప్రారంభించకుండా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోంది.

Musi River : ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది

నాలా రెయిలింగ్ వాల్స్‌, మ్యాన్‌హోల్స్‌పైనే ఫోకస్ పెడుతున్న జీహెచ్‌ఎంసీ.. ముంపు ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. వరద సమస్య నివారణపై దృష్టిపెట్టడంలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినా అవి అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరికొన్నిచోట్ల ఆ పనులను మధ్యలోనే ఆపేసింది. దీంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది. ముంపు సమస్య అలాగే ఉండిపోయింది. అక్కడి ప్రజల కష్టాలు కూడా అలాగే ఉండిపోయాయి.

నిజానికి హైదరాబాద్‌లో వర్షం దంచికొడితే చాలు.. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. వేలాది ఇళ్లు నీట మునుగుతాయి. ఒక గంటలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే ముంపు ప్రాంతాలకు ముప్పు పొంచివున్నట్లే. తాజాగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. మరోవైపు… మరో రెండ్రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముంపు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు హెచ్చరించారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది.