ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల భయం, బయటకు రావాలంటే వణికిపోతున్న గిరిజనం

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 12:15 PM IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల భయం, బయటకు రావాలంటే వణికిపోతున్న గిరిజనం

tiger tension for adilabad district people: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.

ఆసిఫాబాద్‌లో యువకుడిని అడవిలోకి లాక్కెళ్లిన పులి:
ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దహేగాం మండలం దిగెడ గ్రామ శివారులో ఇద్దరు యువకులపై పెద్దపులి దాడి చేయడం కలకలం రేపుతోంది. వారిలో ఓ యువకుడ్ని పులి అడవిలోకి లాక్కెళ్లింది. పీక్కు తినే ప్రయత్నం చేసింది. ఒళ్లంతా గాయాలు కావడంతో… యువకుడు చనిపోయాడు.

చేపలు పట్టేందుకు వెళ్లగా పులి దాడి:
దిగెడకు చెందిన ఇద్దరు యువకులు… సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో… అక్కడికి వచ్చిన పెద్ద పులి సీడాం విఘ్నేష్‌(22)పై దాడి చేసింది. అతణ్ని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అతని తుంటి భాగంపై విపరీతంగా గాయాలు చేసింది. దీంతో యువకుడు చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చనిపోయిన యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు:
కొన్ని రోజులుగా… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేస్తున్నాయి. అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు పులుల కదలికలు చిక్కాయి. కొద్ది రోజులుగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుముర్రంభీం జిల్లాలో మళ్లీ పులుల సంచారం పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఇందూర్ పల్లి, గొల్లఘాట్ గ్రామాల్లో పులి సంచరిస్తోంది. ఇటీవల మేతకు వెళ్లిన నాలుగు ఆవులపై పులి దాడి చేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా పోయింది. పులి భయంతో గత వారం రోజులుగా రైతులు పొలాలకు వెళ్లకుండా భయం భయంగా గడుపుతున్నారు.

ప్రత్యేక బేస్ క్యాంప్ ఏర్పాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన:
అటు మంచిర్యాల జిల్లా, హాజీపూర్, చెన్నూరు అటవీ ప్రాంతాల్లో రెండు పులులు సంచరిస్తున్నాయి. అక్కడ కూడా మేతకు వెళ్లిన పశువులపై దాడి చేశాయి. చెన్నూరు మండలం, శివలింగాపూర్, హజీపూర్ మండలం, నంనూరులో పులుల దాడిలో పశువులు మరణించాయి. వేమనపల్లి, కోటపల్లి, నిన్నెల, జైపూర్ అటవీ ప్రాంతంలో పులులు నిత్యం సంచరిస్తున్నాయి. కుముర్రంభీంజిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో పులుల సంచారం పెరిగింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆహారం కోసం అరణ్యం నుంచి జనంలోకి వస్తున్న పులులు:
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో… అరణ్యంలో నుంచి ఆహారం కోసం నిత్యం జనావాసాల్లో వస్తున్నాయి పులులు. బెజ్జూర్ మండలం పెంచికల్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట పెద్దపులి కనిపిస్తోంది. ఇటీవలి కొన్ని రోజుల క్రితం రోడ్డుపై దర్జాగా నడిచివెళ్తున పులిని చూసి బైక్‍‌పై వెళ్తున్న వారు పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ట్రాక్టర్లు, ఆటోల్లో ప్రయాణించే వారిలో కూడా చాలామంది వీటిని చూసినవారిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… పశువులను అడవిలోకి పంపవద్దని.. ప్రజలు కూడా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.