కొత్త పులి వచ్చిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులులు, భయాందోళనలో గిరిజనులు

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 02:46 PM IST
కొత్త పులి వచ్చిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులులు, భయాందోళనలో గిరిజనులు

adilabad tigers tension: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.

బయటకు వచ్చేందుకు జంకుతున్న గిరిజనులు:
ఆసిఫాబాద్‌లో పెద్దపులి పంజా.. పులి దాడిలో యువకుడి మృతి.. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దహేగాం మండలం దిగెడ గ్రామ శివారులో ఇద్దరు యువకులపై పెద్దపులి దాడి చేయడం కలకలం రేపుతోంది. వారిలో ఓ యువకుడిని పులి అడవిలోకి లాక్కెళ్లింది. పీక్కు తినే ప్రయత్నం చేసింది. ఒళ్లంతా గాయాలు కావడంతో… యువకుడు చనిపోయాడు.

చేపలు పట్టేందుకు వెళ్లిన యువకులపై పెద్దపులి దాడి:
దిగెడకు చెందిన ఇద్దరు యువకులు… సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో… అక్కడికి వచ్చిన పెద్ద పులి సీడాం విఘ్నేష్‌పై దాడి చేసింది. అతణ్ని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అతని తుంటి భాగంపై విపరీతంగా గాయాలు చేసింది. దీంతో యువకుడు చనిపోయాడు.

భయాందోళనలో స్థానికులు:
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చనిపోయిన యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్త పులి వచ్చిందేమోనని అధికారుల అనుమానం:
ఘటనపై స్పందించిన అటవీ అధికారులు.. యువకుడు అడవిలోకి వెళ్లినందుకే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇంతకుముందు ఉన్న పులులు.. జనాలపై దాడి చేయలేదని.. ఇప్పుడు దాడి చేసింది కొత్తది అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.