AP – TS News : ఈ- ఆటోలను ప్రారంభించిన జగన్.. మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ న్యూస్

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడపల్లి వద్ద ఊరూరా చెరువుల పండగలో కవిత పాల్గొంటారు.

AP – TS News : ఈ- ఆటోలను ప్రారంభించిన జగన్.. మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ న్యూస్

Jagan and KTR and Kavitha

Andhra Pradesh:  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఈ- ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం ప్రారంభించారు. వీటిని 36 మున్సిపాలిటీలకు అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ.4.10 లక్షలుకాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ.21.18 కోట్లను వెచ్చించింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ- ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

AP CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. చెత్త సేకరణకు ఈ – ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్.. మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం

మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్  ..

మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జడ్చర్ల‌లో రూ.42కోట్లతో నిర్మించిన 560 ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, కేటీఆర్ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. అదేవిధంగా భూత్పూర్‌ మున్సిపల్‌ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలు గులాబీ మయంగా మారాయి.

Telangana Cheruvula Panduga : తెలంగాణలో చెరువుల పండుగ .. మంత్రి కేటీఆర్‌లో ఎగసిపడిన కవితా కెరటం

ఛలో భూంపల్లి..

కామారెడ్డి జిల్లాలో నేడు ఛలో భూoపల్లికి‌కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22పనుల నిలుపుదల‌కు నిరసనగా రెండు నియోజకవర్గాల శ్రేణుల‌తో మహాధర్నా చేపట్టనుంది. పనులను పూర్తి చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఛలో భూo పల్లి విజయవంతం చేయాలంటున్న టీపీసీసీ సమన్వయ కమిట్ కన్వీనర్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Biparjoy Very Severe Cyclone: పలు రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీవర్షాలు

నిజామాబాద్‌లో కవిత పర్యటన..

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడపల్లి వద్ద ఊరూరా చెరువుల పండగలో కవిత పాల్గొంటారు.

తిరుమల సమాచారం..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల శ్రీవారిని బుధవారం 75,229 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.24 సమకూరింది. 31 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో కారు వేగంగా వచ్చి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు హైదరాబాద్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి లారీని ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగింది.

నిజామాబాద్‌లో బాలిక ఆత్మహత్య ..

నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం శివతాండలో విషాదం చోటు చేసుకుంది. దొంగతనం నింద భరించలేక ఉరి వేసుకుని వందన అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ పౌచ్‌లోని 600 దొంగిలించిందని వందన‌పై ఇంటిపక్క వ్యక్తులు దొంగతనం నెపం మోపారు. తల్లికి ఫోన్ మాట్లాడేందుకు పక్కింటి వ్యక్తి ఫోన్ తీసుకున్న వందన.. ఫోన్ పౌచ్‌లో ఉన్న 600 రూపాయలు దొంగిలించిందని ప్రవీణ్‌తో‌పాటు అతని తల్లి బులి భాయ్ ఆరోపణలు చేసింది. చేయని తప్పుకు నింద వేశారని బాలిక మనస్థాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య‌కు ప్రేరేపించిన ఇద్దరు వ్యక్తుల‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిజామాబాద్‌లో ముసుగు దొంగల కలకలం..

నిజామాబాద్ జిల్లాలో ముసుగు దొంగల కలకలం రేగింది. నాలుగో టౌన్ పరిధిలో కార్ల షోరూంను టార్గెట్‌గా దొంగలు హల్చల్ చేశారు. టాటా షోరూంలో చొరబడి అద్దాలు, సీసీ కెమెరాల ధ్వంసం చేశారు. లక్షకు‌పైగా నగదు చోరి జరిగింది. మహారాష్ట్రకు చెందిన ముఠా‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముసుగు దొంగలు షట్టర్లు ధ్వంసంచేసి చోరీకి పాల్పడ్డారు. దొంగల‌కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ములుగు జిల్లాలో..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ఐదు రోజుల్లో సుమారు 50 మేకలు మృతి చెందాయి. సుమారు 2.50లక్షల నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం ..

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త ముసలయ్య పేట‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి ..

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వామి (36) మృతి చెందాడు. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో నుంచి కిందపడ్డ స్వామి తలకు తీవ్ర గాయం అయింది. జనగామ ఏరియా ఆస్ప‌త్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.