కారు జోరు : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది.
శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభజించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తున్నారు. 120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7గంటల వరకే చేరుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచి, బ్యాలెట్ బాక్సులు పరిశీలించి, ఆ తర్వాత కౌంటింగ్ హాల్‌లోకి తరలించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్ట్రాంగ్ రూమ్‌లోనే తెలియజేయాలని.. ఆలస్యంగా వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల పరిశీలన, తిరస్కరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు.. రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం కానుంది.
బ్యాలెట్ పత్రాలు అయినప్పటికీ ఫలితాలు త్వరగా వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 30 వార్డుల్లోపు ఉన్న మున్సిపాలిటీలే సగానికి పైగా ఉండటంతో మధ్యాహ్నంలోపే ఫలితాలు వెలువడనున్నాయి. 60 వార్డులు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశముంది. అటు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ విధించారు.