TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. వారికి ఎఫీషియన్సీ టెస్ట్

ఇప్పటివరకు గ్రూప్-1 పరీక్ష రాసిన 40మందిని విచారించిన సిట్ అధికారులు.. వీరికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు.(TSPSC Paper Leak)

TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. వారికి ఎఫీషియన్సీ టెస్ట్

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాఫ్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను సిట్ విచారించింది. ప్రవీణ్(ఏ-1), రాజశేఖర్(ఏ-2), డాక్య(ఏ-4), కేతావత్ రాజేశ్వర్(ఏ-5) లను సిట్ అధికారులు విచారించారు. ఇప్పటివరకు గ్రూప్-1 పరీక్ష రాసిన 40మందిని విచారించిన సిట్ అధికారులు.. వీరికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు.

40మందికి క్వశ్చన్ పేపర్ లీకేజీతో ఎలాంటి సంబంధం లేదని సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. డాక్య నాయక్, తిరుపతయ్యలను గ్రామాలకు తీసుకెళ్లారు సిట్ అధికారులు. కాగా, మొదటిసారి కస్టడీలో ప్రవీణ్ నోరు మెదపలేదు. రెండోసారి కస్టడీలో తమదైన శైలిలో ప్రశ్నించారు సిట్ అధికారులు. అటు ప్రవీణ్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. న్యూజిలాండ్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గండీడ్‌కు చెందిన తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 15కు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.

తిరుపతయ్య ఉపాధి హామీలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఏఈ పేపర్‌ను డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య తీసుకుని రాజేంద్ర కుమార్‌కు అమ్మినట్లు తేలింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక సొంత మండలం గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందినవాడిగా తిరుపతయ్యను గుర్తించారు. తిరుపతయ్య నుంచి పేపర్ తీసుకున్న రాజేంద్ర కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతయ్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని నాంపల్లి కోర్టును సిట్ అధికారులు కోరారు. ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్‌లను 6 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక.. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్య, ఏ5 కేతావత్ రాజేశ్వర్‌లను మూడు రోజుల కస్టడీకి కోర్టు ఇటీవల అప్పగించిన సంగతి తెలిసిందే.

అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకరి ద్వారా ఒకరు పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10 లక్షలకు పేపర్ అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇంకా ఎంతమందికి పేపర్ లీక్ చేశారనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చాలామందికి లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఈ పేపర్‌, గ్రూప్-1తో పాటు అనేక పేపర్లు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.

Also Read..TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు