lockdown in Telangana : తెలంగాణలో వీకెండ్స్ లేదా నైట్ లో లాక్ డౌన్ ? పెరుగుతున్న కేసులు

తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

lockdown in Telangana : తెలంగాణలో వీకెండ్స్ లేదా నైట్ లో లాక్ డౌన్ ? పెరుగుతున్న కేసులు

Ts Corona

 Telangana Covid – 19 : తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. ఇప్పుడు వందల్లోకి చేరాయి. ఇవి కేవ‌లం టెస్టులకు చిక్కినవి మాత్రమే.. క్షేత్ర స్థాయిలో వీటికి రెట్టింపు ఉంటాయ‌ని అంచ‌నా. ఇప్పటికే విద్యాసంస్థల్లో కోవిడ్ విస్తరిస్తోంది.. ప‌క్క రాష్ట్రాల నుంచి వ్యాపిస్తున్న వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అలెర్ట్ అయిన‌ప్పటికీ కేసులు మాత్రం ఆగ‌టం లేదు.

ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి. గడచిన వారంల రోజుల్లో ఉమ్మడి కరీంనగర్‌లో 102, ఖమ్మంలో 10, ముదిగొండలో 11, కామారెడ్డిలో 104, నాగర్‌కర్నూల్‌లో 18, నిర్మల్‌లో 48, మేడ్చల్‌లో 38 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో 45 మంది, పాతబస్తిలోని శివాజీనగర్‌ బీసీ గర్ట్స్‌ హాస్టల్‌లో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తెలంగాణలో ఇప్పటివరకు అన్ని స్కూల్స్‌లో దాదాపు 500 నుంచి 600 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు.

దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో… తరగతులు కొనసాగించాలా వద్దా అనే దానిపై పునరాలోచనలో పడింది ప్రభుత్వం. 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ మూసివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది.. కరోనా గండం నుంచి తప్పించుకోవాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే పాక్షికంగా లాక్‌డౌన్ విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

తెలంగాణలో వీకెండ్స్ తో పాటు నైటు పూట కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలా? లేదంటే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలా? అనే అంశంపై కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో వలస కార్మికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతంలో పడ్డ ఇబ్బందులు, అనుభవించిన బాధలు.. వలస కార్మికుల కళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. దీంతో ముందుగానే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.