కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు అందేదెప్పుడు ? మరి క్లాసుల మాటేమిటీ ?

10TV Telugu News

ఒక‌వైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివ‌ర‌కు విద్యార్ధుల‌కు పుస్తకాలు అంద‌లేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్లాసులు ఏ విధంగా వింటార‌నే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇప్పట్లో పుస్తకాలు అందేలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఆర్ట్స్ కి సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ కూడా మొదలు కాలేద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది కొన్ని సబ్జెక్టుల్లో సిలబస్​ కూడా మారింది. దీంతో పాటు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

సర్కారు నుంచి ఆదేశాల కోసం వెయిట్ చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకూ పుస్తకాల ప్రింటింగ్​ చేసే అవకాశాల్లేవని అధికారులు చెప్తున్నారు. కాని సెప్టెంబ‌ర్ 1వ తేది నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి కాబట్టి విద్యార్ధుల‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు అధ్యాప‌క సంఘాల నేత‌లు.వాస్తవానికి జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో సెప్టెంబ‌ర్ 1నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ‌. ప్రస్తుతం ప్రభుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో సెకండియర్​లో 86 వేల మంది విద్యార్థులున్నారు. వారితో పాటు కొత్తగా కనీసం లక్ష మందికి పైగా విద్యార్థులు చేరే అవకాశముంటుంది.

వారందరికీ పుస్తకాలు జూన్ వరకే ప్రింటింగ్ పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ ప్రింటింగ్ కు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఫస్టియర్​లో ఎకనామిక్స్, కామర్స్​ లోని కొంత సెలబస్ మారింది. సెకండియర్​లోనూ ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్ తదితర లాంగ్వేజీలు, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టుల్లో కొంత సెలబస్ మారింది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి, ప్రింటింగ్‌కు సిద్ధం చేశారు.పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులు ఎక్కడ ఉన్నా, కోడ్ స్కాన్ చేసుకొని పుస్తకాలు చదువుకునే వెసులుబాటు ఉంటుందని భావిస్తోంది. ఇదే విషయాన్ని సర్కారుకు ప్రతిపాదనల రూపంలో అధికారులు పంపించారు. కానీ ఇంకా సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.

అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ప్రింటింగ్ అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. సర్కారు ఎంత ఆలస్యం చేస్తే, పుస్తకాల ప్రింటింగ్ అంత అలస్యమయ్యే అవకాశముంది. సర్కారు నుంచి ఆదేశాలు వచ్చి, వాటి ప్రింటింగ్ పూర్తయి జిల్లాలకు, కాలేజీలకు చేరాల్సి ఉంది. ఈ ప్రాసెస్ పూర్తి కావాలంటే, కనీసం మరో నెల రోజులైనా పట్టే అవకాశం కన్పిస్తోంది. మ‌రి అప్పటివ‌ర‌కు విద్యార్ధుల ప‌రిస్థితి ఏంట‌నేది ప్రశ్నార్ధకంగా క‌నిపిస్తోంది.