కాంగ్రెస్ మద్దతిస్తుందా లేక హ్యాండ్ ఇస్తుందా? ఈసారైనా కోదండరాం కోరిక తీరేనా?

10TV Telugu News

Kodandaram..తెలంగాణ రాజకీయ పేజీలో కోదండరామ్‌కు ఎంతొ కొంత స్పేస్ ఉంటుంది. ఉద్యమ సమయంలో జేఏసీకి చైర్మన్‌గా అందరినీ సమన్వయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రొఫెసర్‌ నౌకరీ నుంచి రిటైర్ కావడంతో చట్టసభల్లో అడుగు పెట్టాలనే కుతూహలం ఎక్కువైందని అంటున్నారు.

పార్టీ పరంగా జనంలోకి అంతగా వెళ్లలేక పోవడంతో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధైర్యం సరిపోలేదని టాక్. రాజకీయ నాయకుడిగా ఏదో ఒక ఎన్నికల బరిలో నిలవాలని కోదండరామ్‌ భావిస్తున్నారట. అందుకు అనుగుణంగా త్వరలో జరగబోయే పట్టభద్రుల నియోజవకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు.

మద్దతిచ్చే విషయంలో నోరు మెదపని కాంగ్రెస్:
ఎన్నికల్లో పోటీ చేయాలంటే మామూలు విషయం కాదు. అందులోనూ తెలంగాణలో కారు జోరుకు మిగతా పార్టీలు కకావికలం అయ్యాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీని తట్టుకొని నిలబడాలంటే అన్ని రాజకీయ పక్షాల మద్దతు తీసుకొని పోరాడాలని భావిస్తున్నారట కోదండం సార్‌. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఆయన మద్దతు కోరుకుంటున్నా.. ఇప్పటి వరకూ ఆ పార్టీ స్పందించడం లేదంట. ముఖ్య నేతలను సంప్రదిస్తున్నా సరైన హామీ లభించలేదంటున్నారు.

కాంగ్రెస్ మద్దతిస్తుందా? హ్యాండ్ ఇస్తుందా?
మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండం సారు కాస్త డైలమాలో పడ్డారట. అసలు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందా? లేక చేయిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఇచ్చిన హ్యాండ్ కళ్ల ముందు మెదులుతూనే ఉందట. ఈసారి ఎలాగైనా చాన్స్‌ వదులుకోకూడదని మాజీ ఆచార్యుల వారు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిస్తేనే ఆయనకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ, కాంగ్రెస్‌ ఏం చేస్తుందోనంటూ కోదండరాం తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నా కాంగ్రెస్ వైపు నుంచే ఆందోళనగా ఉందని అంటున్నారు.