ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బ్యాడ్ హిస్టరీ, నాగార్జున సాగర్‌లోనైనా గెలుస్తుందా ?

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బ్యాడ్ హిస్టరీ, నాగార్జున సాగర్‌లోనైనా గెలుస్తుందా ?

Nagarjuna Sagar by-election? : ఒకప్పుడు తమ కంచుకోట అని చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పేరుకు పెద్ద పెద్ద నేతలు ఉన్నా.. పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత శాసనసభ ఎన్నికలు మొదలుకొని.. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలతో పాటు రెండు బై ఎలక్షన్స్‌ ల్లోనూ కాంగ్రెస్ పార్టీ చేదు ఫలితాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంతలో కొంత ఊరటలా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రభావాన్ని నిలుపుకుంది. అయితే ఆ తర్వాత కూడా చేదు ఫలితాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు.. ఒక్క స్థానానికే పరిమితమైంది. దశాబ్ధాలుగా హస్తం పార్టీ కంచుకోటలుగా ఉన్న స్థానాలు సైతం గత ఎన్నికల్లో గులాబీ కోటలో చేరాయి.

హుజూర్ నగర్ బై ఎలక్షన్ :-
ఆదినుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ను ఉపఎన్నికలు పెద్దగా కలిసి వచ్చిన సందర్భాలు లేవు. ప్రస్తుత శాసనసభ కాలంలోనూ అదే రిపీట్ అయింది. తన కంచుకోట అని చెప్పుకునే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీచేసి గెలుపొందడంతో ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని బరిలో నిలిపారు. హుజూర్ నగర్ బై ఎలక్షన్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి పరాజయాన్ని చవిచూశారు. మొదటిసారి టీఆర్ఎస్ శానంపూడి సైదిరెడ్డి గెలుపొందడంతో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ క్యాడర్ ను షాక్ కు గురిచేసింది. ఆ తర్వాత నుంచి ఉత్తమ్ దంపతులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని నియోజకర్గంలో టాక్.

మునుగోడు‌లో చిన్నపరెడ్డి విజయం :-
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కు దక్కిన ఏకైక స్థానం మునుగోడు. అప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి … ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో తన భార్య లక్ష్మీని రాజగోపాల్ రెడ్డి బరిలోకి దించారు. కానీ అనుహ్యంగా టిఆర్ఎస్ తరుపున బరిలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. అలా సిట్టింగ్ స్థానాలైన హుజూర్ నగర్ అసెంబ్లీ, నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది.

నోముల అకాల మరణం :-
ఇక నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే సొంత జిల్లాలో రెండు ఉపఎన్నికలతో పాటు.. దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలతో ఢిలా పడిన కాంగ్రెస్ క్యాడర్ నాగార్జునసాగర్ వైపు ధీనంగా చూస్తోంది. సీనియర్ నేత జానారెడ్డికి ఈ నియోజకవర్గం పెట్టని కోట. గత ఎన్నికల్లో వివిధ అంశాలు ఆయన ఓటమికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. అయితే త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో జానారెడ్డి బరిలోకి దిగి విజయం సాధించాలని.. దాంతో తమకు నూతనుత్తేజం వస్తుందని క్యాడర్ భావిస్తోందట.

పదవికి పోటీ చేయనంటున్న జానా :-
కానీ జానారెడ్డి కుటుంబం తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి నుంచి మీడియాకు లీకులు అందడం.. అది విస్తృతంగా ప్రచారం కావడంతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయం పడినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్ రెడ్డి, జై వీర్ రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇదే క్రమంలో కేవలం రెండు సంవత్సరాల కాలమున్న పదవికి తాను పోటీ చేయనంటూ జానారెడ్డి మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ ను మరింత అయోమయానికి గురిచేసినట్లైందట.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక :-
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్‌కు అనివార్యం. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఇప్పటివరకు ఢిలా పడిన క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. ఈ ఫలితం ఇచ్చే బూస్టప్తో వచ్చే ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయవచ్చు. తమ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపునుంది. అలా కాకుండా ఓటమి ఎదుర్కొంటే మాత్రం.. ఇప్పటికంటే అధాపాతాళానికి పార్టీ పరిస్థితి దిగజారిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు కీలకం కానుంది.

కాంగ్రెస్‌లో ఉత్కంఠ :-
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉంటాయన్న అభిప్రాయం కాంగ్రెస్ క్యాడర్ తో పాటు రాజకీయవర్గాల్లో కూడా వినిపిస్తున్న వాదన. కానీ రెండేళ్ల కోసం తాను పోటిచేయనని ఆయన ఇప్పటికే చెప్పారు. దీంతో తన కొడుకు రఘువీర్ ను బరిలోకి దింపి ప్రయోగం చేస్తారా అన్న సందేహం క్యాడర్ లో కనిపిస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయవద్దని క్యాడర్ తో పాటు జిల్లా నేతలు కూడా కోరుతున్నారు. మరోవైపు ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తే.. టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బిజెపికి సైతం చెక్ పెట్టినట్లవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్కంఠను రేపుతున్నాయి.