Woman killed : ప్రాణం తీసిన మత్తు..

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ చే నంబర్‌ చౌరస్తాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్‌ చేశాడు.

Woman killed : ప్రాణం తీసిన మత్తు..

Woman killed in road accident : ఏమీ మారలేదు.. ఏ మాత్రం మార్పు రాలేదు.. ప్రాణాలు పోతున్నా.. తాగుబోతులతో పాటు వ్యవస్థ కూడా మత్తు వదలడం లేదు. నిషాలోనే తూగుతూ ఉసురు తీస్తున్నారు. పీకలదాకా తాగి ప్రాణాలు తోడేస్తున్నారు. పూటుగా మద్యం సేవించి జీవితాలను గాల్లో కలిపేస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరిగినా.. ఎన్నో కుటుంబాల్లో విషాదం అలుముకుంటున్నా.. వ్యవస్థలో అస్సలు మార్పు రాలేదు.

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ చే నంబర్‌ చౌరస్తాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్‌ చేశాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్‌పై వెళ్తున్న దంపతుల్లో భార్య మల్లమ్మ మృతి చెందగా.. భర్త బాలరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన అంబర్‌పేట్‌ పోలీసులు.. నిందితుడు వినయ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు.

ఇటు హైదరాబాద్‌ నిజాంపేటలో వారం క్రితం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ యాక్సిడెంట్‌లో కేపీహెచ్‌బీ ఏఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందారు. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర.. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసిన సృజన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో.. కారు ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలయ్యాయి. కారు నడిపిన వ్యక్తికి.. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే.. మీటర్ 170 దాటింది.

దీంతో.. ట్రాఫిక్‌ పోలీసులు సివిల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి ASI మహిపాల్ రెడ్డి వచ్చారు. ఘటనా స్థలంలో.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండగానే.. మరోకారు మహిపాల్ రెడ్డిని ఢీకొట్టింది. ASI తలకు తీవ్ర గాయమవడంతో.. పరిస్థితి విషమంగా మారింది. ఏఎస్‌ఐను పోలీసులు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్‌ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. మత్తుగాళ్ల నిర్లక్ష్యానికి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు చర్చ జరుగుతున్నా.. తర్వాత అంతా మరిచిపోతున్నారు.