Mahatma Gandhi : మీరు మాకు బారిస్టర్‌ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం.. గాంధీ మీకు మాకు మహాత్ముడే : సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్
‘మీరు మాకు బారిస్టర్‌ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అంటూ సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ గాంధీజీని కొనియాడారు.

Your 'Mahatma' is our 'Mahatma' South Africa Cedric Crowley
Mahatma Gandhi : భారత జాతిపిత మహాత్మాగాంధీ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌవరవాభిమానాలు ఉన్నాయని మరోసారి నిరూపితమైంది. గాంధీజీ భారతదేశానికే కాదు సౌతాఫ్రికా దేశానికి కూడా మహాత్ముడే అంటూ సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ గాంధీజీని కొనియాడారు. ‘దక్షిణాఫ్రికాతో వాణిజ్యం-పెట్టుబడి అవకాశాలు’ అనే అంశంపై హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో గురువారం (మార్చి23, 2023) నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో క్రౌలీ తెలుగులో ‘నమస్కార్ ’అంటూ ప్రాంభించి భారతీయులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రౌలీ తన ప్రసంగంలో గాంధీజీ గురించి ప్రస్తావించారు.
‘మీరు మాకు బారిస్టర్‌ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అని అన్నారు. లండన్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని భారత్ తిరిగి వచ్చిన గాంధీ వృత్తిరీత్యా దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాలు ఉండిపోయారు గాంధీ. అక్కడే జాతి వివక్ష గురించి తెలిసింది గాంధీకి. అలా గాంధీ అంటే దక్షిణాఫ్రికా దేశస్థులకు తమ దేశపౌరుడే అన్నట్లుగా ఉంటారు.
ఇదిలా.. ఉంటే దక్షిణాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ మాట్లాడుతూ.. భారత్- దక్షిణాఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చరిత్రాత్మకమని..ఇది చాలా సంవత్సరాల నాటిదని గుర్తు చేశారు. రక్షణ, కళలు, సంసృతి, వ్యవసాయం తదితర రంగాల్లో సౌతాఫ్రికాకు భారత్ సహకారం అందించాలని కోరారు. ఐసీటీ (ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ)లో హైదరాబాద్‌కు మంచి గుర్తింపు ఉందని, సిలికాన్ వ్యాలీని అధిగమించింది అంటూ ప్రశంసలు కురిపించారు. మీరు (అంటే భారతదేశం) ఈ ప్రపంచానికి ‘సున్నా’ను ఇచ్చారని అది ప్రపంచానికి ఓ గొప్ప విషయంగా.. సంచలనంగా మారిందని ప్రశ్నంసించారు. (సున్నాను కనిపెట్టిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట)ఈ కార్యక్రమంలో పొలిటికల్ ఫస్ట్ సెక్రటరీ కతుషిలో తంగ్వానా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి పాల్గొన్నారు.
Also Read: ఎలాన్ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ అధినేత
కాగా ఈ సమావేశంలో క్రౌలి భారతదేశం, భారతీయుల ప్రతిభాపాటవాలపై ప్రశంసలు కురిపించారు. భారత్ తో మా సంబంధాన్ని పున:ప్రారంభించటానికి నా పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. ఈ బంధం రెండు దేశాలకు విజయం చేకూర్చాలని ఆశాభావం వ్యక్తంచేసి క్రౌటీ ‘మాకు సహజ సౌందర్యం ఉంది.. మీకు సహజమైన ప్రతిభ ఉంది. ఇరు దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయ’ని అన్నారు.