విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి

LG పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మచిపోకముందే విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్‌లుగా గుర్తించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. అర్ధరాత్రి దాటాక గ్యాస్ లీకయినట్టు గుర్తించారు అధికారులు.