బాబోయ్.. ఏపీలో ఒక్కరోజే కరోనాతో 43మంది మృతి, మళ్లీ 1900లకు పైగా కేసులు

ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 8 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 1908 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 33వేల 19 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో 43 మంది మృతి చెందారు.
అత్యధికంగా అనంతపురం జిల్లాలో 10మంది మృతి:
అనంతపురం జిల్లాలో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17వేల 467కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేల 144. ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రజల్లో భయాందోళనలు:
కాగా, ఒక్కరోజు వ్యవధిలో ఏపీలో కరోనాతో 43మంది మరణించడం ఇదే తొలిసారి. 24 గంటల్లో ఇంత మంది చనిపోవడం, కొన్ని రోజులుగా రాష్ట్రంలో 19 వందలకు పైగా కేసులు నమోదు అవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అప్పుడే కరోనాని కట్టడి చేయగలమని అధికారులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు:
కర్నూలు జిల్లా -3823
అనంతపురం జిల్లా -3651
గుంటూరు జిల్లా – 3356
తూర్పుగోదావరి జిల్లా – 3115
చిత్తూరు జిల్లా – 3074
కృష్ణా జిల్లా – 2744
పశ్చిమగోదావరి జిల్లా – 2026
కడప జిల్లా – 1982
విశాఖపట్నం జిల్లా – 1489
నెల్లూరు జిల్లా – 1419
శ్రీకాకుళం జిల్లా – 1414
ప్రకాశం జిల్లా – 1238
విజయనగరం జిల్లా – 832