7 పీఎం న్యూస్…20 వార్తలు

7 పీఎం న్యూస్, 20 వార్తలు

7 పీఎం న్యూస్…20 వార్తలు

Politcial

Updated On : March 10, 2021 / 8:19 PM IST

7pm News : 1. స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు : – ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరిగింది. మున్సిపాలిటీల్లో 70.6, కార్పొరేషన్లలో 57.1 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు అధికారులు. గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ పెరిగే అవకాశమున్నట్టు ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న టెన్షన్‌ అభ్యర్థుల్లో నెలకొంది. ఈనెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే.. 89 ఏకగ్రీవం అయ్యాయి.71 మున్సిపాల్టీల్లో 2వేల 123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా చోట్ల పోలింగ్‌ జరిగింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

విజయవాడలోని 23వ డివిజన్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100321-198 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని100321-222, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. పటమటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఓటు వేశారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిందూపురం 2వ వార్డులో ఎమ్మెల్యే బాలకృష్ణ క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర కూడా ఉన్నారు. నగిరి మున్సిపాలిటీలో రోజా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2. ఏపీలో మున్సిపల్ ఉద్రిక్తతలు : –
ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తిరుపతి, కదిరి, సత్తెనపల్లి, యలమంచిలి మున్సిపాలిటీల్లో గొడవలు జరిగాయి. తిరుపతి 15 డివిజన్‌లో మహాత్మాగాంధీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ నేతలను అనుమతించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌చేశారు. 18వ వార్డులో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కీర్తిని పోలీసులు దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాన్ని అడ్డగించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి 24వ వార్డు పోలింగ్‌ బూత్‌ లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారుపై దాడి జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సత్తెనపల్లి 7వ వార్డులో స్వతంత్ర్య అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. అనంతపురం జిల్లా కదిరి 28వ వార్డులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ .. వారితో వాగ్వాదానికి దిగారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్థి రాజేంద్ర హల్‌చల్ చేశాడు. పార్టీ రంగును సూచించేలా ఉన్న పచ్చచొక్కాను ధరించి పోలింగ్ బూత్‌ దగ్గరికి రావొద్దన్నందుకు అక్కడే చొక్కా విప్పేశాడు. బనియన్‌తో రోడ్డుపై వీరంగం సృష్టించాడు. 100321-226 విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలోని ఎర్రవరం వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి పిట్టా శ్రీను …పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. మున్సిపోల్స్‌లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. ఏలూరు కార్పొరేషన్‌లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఓటే గల్లంతయ్యింది. దీంతో తీవ్ర అసహనంతో ఓటు వేయకుండానే వెనుతిరిగారు.

3. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, భగ్గుమన్న తెలుగు రాష్ట్రాలు :-
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ పాలసీపై తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాలు ఏకమవుతున్నాయి. విశాఖ ఉక్కును వంద శాతం ప్రయివేటీకరిస్తామన్న కేంద్రం ప్రకటనపై ఏపీతో పాటు తెలంగాణలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే..విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణను..తమకు సంబంధంలేని వ్యవహారం అనుకోబోమన్నారు కేటీఆర్. ఇప్పుడు తాము పట్టించుకోకపోతే…తర్వాత…కేంద్రం తెలంగాణ దగ్గరకే వస్తుందన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని హామీ ఇచ్చిన కేంద్రం… ఇప్పుడు విశాఖలో పోరాడి సాధించుకున్న సంస్థను అమ్మేస్తామంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విశాఖ అంటున్నారు, రేపు బీహెచ్‌ఈఎల్, సింగరేణి అమ్ముదామంటారని ఆందోళన వ్యక్తంచేశారు. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ సర్కార్ ప్రైవేట్‌పరం చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. తాము ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నట్టుగానే..తెలంగాణలో ఏం జరిగినా..ఆంధ్రప్రదేశ్ తమకు మద్దతివ్వాలని కేటీఆర్ కోరారు.

అటు కేటీఆర్ మద్దతుపై విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి హర్షం వ్యక్తంచేసింది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దుతు ప్రకటించడాన్ని టీడీపీ స్వాగతించింది. మరోవైపు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలిపిన కేటీఆర్‌కు సీపీఐ నేత నారాయణ ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం చేయాలన్నారు.

4. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం చెప్పిన కేంద్రం :-
విశాఖ స్టీల్ ప్లాంట్‌ నష్టాలకు సొంతగనులు లేకపోవడం కూడా ఒక కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. సొంత గనులు లేనందువల్ల ఓపెన్ మార్కెట్ నుంచి ముడి ఖనిజం కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. తమకు గనులు కేటాయించాల్సిందిగా ఒడిశా, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను RINL కోరిందని పేర్కొన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు సొంతంగా బొగ్గు, ఇనుప గనులున్నాయని.. కొన్నాళ్లపాటు నష్టాల్లో నడిచిన ఆ సంస్థ ఇప్పుడు లాభాల్లో పయనిస్తోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అయితే RINL మాత్రం నష్టాల్లోనే కొనసాగిందన్నారు.

ఇటు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిని కలిశారు.. వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి. సీఎం జగన్‌ ప్రధానికి రాసిన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రజల త్యాగాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. ప్లాంట్‌కు గనులను కేటాయిస్తే… లాభాల్లోకి వస్తుందని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. భవిష్యత్తులో మరోసారి కేంద్ర ఉక్కు మంత్రిని, ఆర్ధికమంత్రిని కలిసి ప్రైవేటీకరణ ఆపాలని కోరతామన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికసంఘాలు, అఖిలపక్ష నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రాణ త్యాగాలకైనా రెడీ అంటున్నారు.

5. జగన్ ను కలిసిన ఎంపీ సుబ్రమణ్య స్వామి :-
ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. టీటీడీ లావాదేవీలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు సుబ్రహ్మణ్య స్వామి. తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించేందుకు పోరాడతామన్నారు సుబ్రహ్మణ్యస్వామి. తమిళనాడులోని సబానాయకర్ ఆలయ నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దేశంలోని అన్ని ఆలయాల నిర్వహణను ట్రస్టులే చూసుకునేలా కృషి చేస్తానన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణను తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడం సరికాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రతిదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని.. బలమైన కారణాలుంటేనే అలా చేయాలన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? లేదా? అనేదాన్ని కేస్‌ బై కేస్‌ చూడాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ప్రధానికి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్ లేఖ రాశారని… తన బాధ్యత నెరవేర్చారని అభిప్రాయపడ్డారు సుబ్రమణ్యస్వామి.

6. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి : –
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. నిరుద్యోగులను, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. అటు బండి సంజయ్‌ కామెంట్స్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఓట్ల కోసం బీజేపీ గ్రాడ్యుయేట్లను మోసం చేస్తుందని విమర్శించారు.

పట్టభద్రులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి . లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న మాటకు కట్టుబడి ఉన్నామని.. దీనిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. అనురాగ్ విద్యాసంస్థల్లో బోగస్ ఓట్లు నమోదు చేయించారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఉద్యోగ కల్పనపై ఓయూ వేదికగా చర్చకు తాము సిద్ధమని టీఆర్ఎస్‌ నేతలెవరైనా ఇక్కడి రావాలన్నారు హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు.

7. విద్యార్థులపై దాడిని ఖండించిన షర్మిల : –
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడులను వైఎస్. షర్మిల ఖండించారు. విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందన్నారు. విద్యార్థుల బలిదానాలపై అధికారంలోకి వచ్చి. . ప్రశ్నించినందుకు వారిపైనే దాడులు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో వైఎస్‌ షర్మిల సమావేశమయ్యారు. పార్టీ ఏర్పాటుపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
వరంగల్‌ ఎంతోమంది ఉద్యమకారులను అందించిన పురిటిగడ్డ అన్నారు. కంతన్‌పల్లి ప్రాజెక్టునూ ఇప్పటికీ పూర్తి చేయకపోవడం బాధాకరమని షర్మిల అన్నారు. కాకతీయ యూనివర్సిటీకి కనీసం వీసీ కూడా నియమించలేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే వరంగల్‌ అభివృద్ధిలో దూసుకుపోయేదన్నారు. వైఎస్‌కు వరంగల్‌తో తీరని అనుబంధం ఉందని చెప్పారు. వరంగల్‌ను ఐటీ సిటీగా మార్చాలని వైఎస్‌ నాడు కలలు కన్నారని గుర్తు చేశారు. వరంగల్‌ను స్మార్ట్‌ సిటీ చేస్తామన్న ప్రభుత్వ హామీ ఎటుపోయిందని నిలదీశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును 80శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు షర్మిల.

8. దేత్తడి హరిక : –
బిగ్‌బాస్ ఫేం… దేత్తడి హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం పెద్ద దుమారాన్నే రేపింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే హారికను నియమించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తనకు సమాచారం లేకుండా అంబాసిడర్‌ను నియమించడమేంటని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. అయితే మంత్రితో తాను మాట్లాడనని హారికనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతుందని టీడీసీ ఛైర్మన్ శ్రీనివాస్‌ గుప్తా చెప్పారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేయడంలో భాగంగానే హారికను నియమించినట్లు వివరించారు.

టీడీసీ ఛైర్మన్ శ్రీనివాస్‌ గుప్తపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్‌ అయ్యారు. టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక ఎంపిక విషయంలో టీడీసీ ఛైర్మన్ శ్రీనివాస్‌ గుప్తా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో చాలామంది గుర్తింపు పొందిన వారున్నారని.. కొందరి పేర్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. త్వరలో సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే బావుండదని హెచ్చరించారు శ్రీనివాస్ గౌడ్‌.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హారికను టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా. హారికకు సోషల్‌ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉందని అందుకే ఆమెను అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. హారిక నియామకంపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

9. వేద పాఠశాలల్లో కరోనా కలకలం : –
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న వారిలో 58మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను స్విమ్స్‌ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అయితే వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని…ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ తెలిపారు.

కరోనా సమయంలో వేద పాఠశాలలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాఠశాలను మూసివేశారు. లాక్‌డౌన్‌ తర్వాత నెలరోజుల క్రితమే వేద పాఠశాలను మళ్లీ తెరిచారు. ఇంతలోనే 58మంది విద్యార్థులకు వైరస్‌ సోకడం కలకలం రేపింది. రెండ్రోజుల నుంచి విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 450మందికి కోవిడ్ టెస్టులు చేశారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి మిగిలిన వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. విషయం తెలిసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వేద పాఠశాలలో విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

10. వనస్థలిపురంలో దారుణం : –
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గగన్ అగర్వాల్ అనే వ్యక్తిని రెండో భార్య దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. తన భర్త కనిపించడం లేదని నాటకం ఆడింది. గగన్ అగర్వాల్ రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. గతేడాది జూన్‌లో పాతబస్తీకి చెందిన నౌషిరా బేగాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి గగన్ అగర్వాల్ కనిపించకుండా పోయాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లళ్లో వెతికినా గగన్ ఆచూకీ తెలియలేదు. దీంతో గగన్ సోదరుడితో కలిసి నౌషిరా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నౌసిన్ బేగం ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లిపోయింది. గగన్ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులే ఏమైనా చేసి ఉంటారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గగన్ భార్యను విచారించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. లోతుగా దర్యాప్తు చేయడంతో భర్తను తానే చంపానని నౌసిన్ ఒప్పుకుంది. మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టినట్లు పోలీసులకు తెలిపింది. నౌషిరా స్నేహితుడు సునీల్‌తో కలిసి ఆమె ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణంగానే అతన్ని చంపినట్లు నిందితురాలు చెబుతోంది. మరోవైపు పరారీలో ఉన్న సునీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

11. వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల హీట్ : –
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓ వైపు ప్రచారం.. మరో వైపు నామినేషన్ల పర్వం జోరందుకుంది. బెంగాల్ సీఎం , తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేశారు. బీజేపీతో గట్టిపోటీ నేపథ్యంలో ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దీదీ.. నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తూ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. ఇటు మమతకు పోటీగా సువేందు అధికారి ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు. సువేందును మట్టికరిపిస్తానని దీదీ శపథం చేస్తే.. సొంతగడ్డపై సత్తాచాటుతానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రేపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. దీదీ కోటలో హిందుత్వ కార్డుతో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు మేనిఫెస్టో విడుదలకు వ్యూహాత్మకంగా శివరాత్రిని ఎంచుకుంది తృణమూల్ కాంగ్రెస్. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే…చేయబోయే పనులను పది పాయింట్లగా మ్యానిఫెస్టోలో చేరుస్తోంది టీఎంసీ. ఏపీలో జగన్ నవరత్నాలు, పంజాబ్‌లో కెప్టెన్‌ నఖ్తే, బీహార్‌లో నితీశ్ కే సాత్ నిశ్చయ్ వ్యూహంతో ఆయా నేతలకు అధికారం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్.. దీదీ కోసం పది పాయింట్ల ఫార్ములా రచించారు.

ఏపీలోలానే పశ్చిమ బెంగాల్‌లోనూ రేషన్ ఉచిత సరఫరా హామీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మమత భావిస్తున్నారు. వామపక్షాల పాలనా కాలం నుంచి రేషన్ సరఫరాపై పశ్చిమ బెంగాల్‌లో అనేక ఆరోపణలు ఉన్నాయి. మమతా బెనర్జీ పాలనలోనూ రేషన్ కేంద్రాలపై అవినీతి ముద్ర తొలగిపోలేదు. ఏపీలో అమలు చేస్తున్నట్టుగా…ఇంటి దగ్గరకే వచ్చి రేషన్ అందిస్తే..అవినీతిని అడ్డుకోవచ్చని మమత భావిస్తున్నారు. ఇక మ్యానిఫెస్టోలో ప్రజారోగ్యం, మహిళలు, ఉద్యోగాలు అంశాలకు పెద్దపీట వేసినట్టు సమాచారం.

12. పార్లమెంట్ సమావేశాలు : –

పార్లమెంట్‌ ఉభయ సభలు వరుసగా మూడో రోజూ ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడ్డాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో స్వల్ప విరామాలతో సభను మూడుసార్లు వాయిదా వేశారు. విపక్ష సభ్యులు మళ్లీ నిరసనకు దిగడంతో లోక్‌సభ మార్చి 15 వరకు వాయిదా పడింది.

అటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజ్యసభ దద్దరిల్లింది. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకున్నాయి. డిప్యూటి చైర్మన్ హరివంశరాయ్‌ చర్చకు అనుమతించలేదు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ కూడా వచ్చే సోమవారానికి వాయిదా పడింది. సోమ, మంగళ వారాల్లో కూడా పార్లమెంట్‌ను పెట్రోధరలు కుదిపేశాయి.

13. హర్యానా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం : –
హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తప్పుపట్టారు. ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా ఆరోపించారు.

14. ఉత్తరాఖండ్ సీఎంగా : –
ఉత్తరాఖండ్‌ సీఎంగా తీరత్‌ సింగ్‌ రావత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రిగా తీరత్‌ బాధ్యతలు చేపట్టారు. 56ఏళ్ల తీరత్‌.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013-15 మధ్య భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో చౌట్టఖల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నాయకత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేయడంతో నిన్న త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో చాలామంది ఆశావహులు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. ధన్‌సింగ్‌ రావత్‌, కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌లలో ఎవరో ఒకరికి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో అనూహ్యంగా తీరత్‌ పేరు తెరపైకి వచ్చింది. తీరత్‌ను నూతన ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది.

56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్.. 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని సీఎం స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు తీరత్‌. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పార్టీ చీఫ్‌ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు తీరత్‌. ప్రజల ఆశలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.

15. కేరళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ : –
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. కేరళ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. దీంతో విసిగిపోయిన చాకో పార్టీని వీడారు. ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్‌ పార్టీ పనిచేయడం లేదని కేవలం రెండు గ్రూపులే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం నాయకత్వం లేని పార్టీగా కాంగ్రెస్‌ పనిచేస్తోందన్నారు పీసీ చాకో. గడిచిన ఏడాది కాలంగా అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్‌ ముందుకెళుతోందన్నారు. పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోజురోజుకు పార్టీ పతనం అవుతోందన్నారు. కేరళ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకపోవడంపై ఫైర్‌ అయ్యారు చాకో. పార్టీ అధిష్టానంపై పలువురు సీనియర్లు ఇప్పటికే తమ అసహనాన్ని వెల్లగక్కారు. ఐదురాష్ట్రాలకు ఎన్నికలకు జరుగుతున్న వేళ చాకో లాంటినేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

16. భారత్ లో కరోనా వ్యాక్సిన్ : –
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. రికవరీ కేసులు రోజూ పెరుగుతున్నాయని ఆనంద పడదామన్నా… కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 17వేల 921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి 12 లక్షల, 62 వేలు దాటింది. కొత్తగా 133 మంది మృతిచెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య లక్షా 58 వేలు దాటింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 20 వేల 652 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 9వేల 900ల కొత్త కేసులు వచ్చాయి. కేరళలో 2 వేల 300 వేలు, పంజాబ్‌లో వెయ్యిమంది దీనిబారిన పడ్డారు. మహారాష్ట్రలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ లేదా కఠిన నిబంధనల గురించి శివసేన పత్రిక సామ్నా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు వద్దనుకుంటే ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించింది. లాక్‌డౌన్‌పై స్థానిక యంత్రాంగం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఇప్పటికే మహారాష్ట్ర మంత్రి కూడా వ్యాఖ్యానించారు.

17. దాతృత్వాన్ని చాటుకున్న భారత్ : –
భారత్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. నిత్యం ఇండియాపై కుట్రలు చేసే పాకిస్తాన్‌కు కూడా మన దేశం సాయం చేస్తోంది. కరోనా సంక్షోభంలో దాయాది పాక్‌కు అండగా నిలిచింది. కోవిడ్ సంక్షోభంలో ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తోన్న భారత్…శత్రు దేశం పాకిస్తాన్‌కు కరోనా వ్యాక్సిన్‌లు సరఫరా చేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్‌కు ఏకంగా నాలుగున్నర కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అందించనుంది మోదీ ప్రభుత్వం. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన ఈ ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ను పాకిస్తాన్‌కు ఉచితంగా అందించనుంది ఇండియా. తొలి దశ డోస్‌లు మరో వారం రోజుల్లోనే పాకిస్థాన్‌కు చేరుకుంటాయి. మిగతావి జూన్ నాటికి వెళ్తాయి. గవి ఒప్పందంలో భాగంగా భారత్ వీటిని పంపుతోంది.
వ్యాక్సిన్‌ దౌత్యంలో భారత్‌ ఇప్పటికే ముందుంది. 65 దేశాలకు కోవిడ్‌ టీకాను పంపిణీ చేసింది. పలు దేశాలకు ఉచితంగా అందిస్తుండగా.. మరికొన్ని దేశాలు డబ్బు చెల్లించి కొనుగోలు చేశాయి. శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాయన్మార్, షీషెల్స్ సహా పలు దేశాలకు సుమారు 6కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపింది.

18. ముకేశ్ అంబానీ ఇంటి దగ్గర : –
ముకేశ్ అంబానీ ఇంటి దగ్గర స్కార్పియోలో పేలుడు పదార్ధాలు ఉంచిన కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీంతో మన్‌సుఖ్ హిరాన్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను క్రైమ్ బ్రాంచ్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సచిన్‌ వాజ్‌పై హిరాన్ భార్య విమల ఫిర్యాదు చేశారు. తన భర్తను సచిన్ వాజ్ హత్య చేశారన్న ఆమె ఫిర్యాదుతో థానే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 5న థానేలోని ముంబ్రా కాల్వలో మన్‌సుఖ్‌ హిరాన్ శవమై కనిపించేంత వరకు జరిగిన సంఘటనలన్నింటినీ వివరించారు విమలా హిరాన్. గత ఏడాది నవంబరులో హిరాన్ తన స్కార్పియోను పోలీసు అధికారి సచిన్‌ వాజ్‌కు ఇచ్చారని, వాజ్ తమ గ్యారేజ్‌కు తరచుగా వచ్చేవారన్నారు.

ఫిబ్రవరి 5న స్టీరింగ్ మార్చడం కోసం స్కార్పియోను షాప్‌కు తీసుకెళ్లారని విమల తెలిపారు. ఫిబ్రవరి 17న స్కార్పియోలో ముంబై నుంచి హిరాన్ బయలుదేరారని, అయితే స్టీరింగ్ సరిగ్గా లేకపోవడంతో ములుంద్ టోల్ ప్లాజా దగ్గర పార్క్ చేసి వెళ్లిపోయారని చెప్పారు. ఆ మరుసటి రోజు స్కార్పియోను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాలతో ఉన్న ఈ స్కార్పియోను పోలీసులు గుర్తించారు. ముఖేశ్ ఇంటి దగ్గర స్కార్పియోను గుర్తించిన రోజే విఖ్రోలి ఏటీఎస్ విభాగం పోలీసులు తన భర్త హిరాన్‌ను ప్రశ్నించారని తన ఫిర్యాదులో విమల తెలిపారు. ఆ స్కార్పియోను గుర్తించిన తన భర్త..ఫిబ్రవరి 18 నుంచి కారు కనిపించడం లేదని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులకు చూపించారన్నారు. ఫిబ్రవరి 27,28, మార్చి రెండో తేదీల్లో తన భర్త, పోలీసు అధికారి సచిన్‌ వాజ్‌తో కలిసే ఉన్నారని తెలిపారు. వాజ్ సలహా మేరకు పోలీసులు, మీడియా తనను వేధిస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, హోం మంత్రికి, థానే, ముంబై పోలీసు కమిషనర్లకు ఫిర్యాదు చేశానని హిరాన్ తనతో చెప్పారని విమల తన ఫిర్యాదులో వివరించారు. హిరాన్ ముఖం చుట్టూ ఐదు హ్యాండ్ కర్చీఫ్‌లు ముడేసి ఉన్నాయని థానే పోలీసులు చెప్పారని, తన భర్త మంచి స్విమ్మర్ అని, కాల్వలో మునిగే అవకాశమే లేదన్నారు విమల.

19. ఎలోన్ మస్క్ న్యూ రికార్డు : –
ప‌్రపంచ కుబేరుల్లో రెండోస్థానంలో ఉన్న ఎలోన్ మ‌స్క్ కొత్త రికార్డు సృష్టించారు. ఒకే రోజు ఆయ‌న సంపాద‌న ఏకంగా 1.82 ల‌క్షల కోట్లు పెరిగింది. టెస్లా షేర్లు 20 శాతం పెర‌గ‌డంతో మ‌స్క్ మ‌రింత సంప‌న్నుడ‌య్యారు. ప్రస్తుతం ఆయ‌న సంప‌ద విలువ 12.70 ల‌క్షల కోట్ల కు చేరింది. ఒక్క రోజు సంపాద‌న‌తో బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్‌లో తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్‌కు మ‌స్క్ చేరువ‌య్యారు. మ‌రోవైపు ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌లాంటి టెక్ కంపెనీల షేర్లు లాభపడటంతో నాస్‌డాక్ రాత్రికి రాత్రి 3.7 శాతం లాభపడింది. అమెజాన్ షేర్లు లాభ‌ప‌డ‌టంతో బెజోస్ కూడా ఒక్క రోజు 600 కోట్ల డాల‌ర్లు సంపాదించారు. దీంతో ఆయ‌న మొత్తం సంప‌ద విలువ రూ.13.13 ల‌క్షల కోట్లకు చేరింది. గ‌త జ‌న‌వ‌రిలో బెజోస్‌ను వెన‌క్కి నెట్టి ఎలోన్ మ‌స్క్ ప్రపంచ కుబేరుడిగా అవ‌త‌రించినప్పటి నుంచీ ఈ ఇద్దరి మ‌ధ్య తొలిస్థానం కోసం తీవ్ర పోటీ న‌డుస్తోంది. మస్క్‌ ఇలాగే లాభాలు గడిస్తే ఫస్ట్‌ ప్లేస్‌కు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదు.

20. టీమిండియాకు గాయాల బెడద
ఇంగ్లండ్‌తో T-20 సిరీస్‌కు ముందు భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఒకరు కాదు ముగ్గురు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. యార్కర్ స్పెషల్ నటరాజన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యంగ్ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియా కూడా టీ-20 సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో బుమ్రా దూరం కావడంతో నటరాజన్‌ కీలకం అని భావించారు. అయితే గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన నట్టూ మరికొన్ని రోజులు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని నేషనల్‌ క్రికెట్ అకాడమీ తెలిపింది. భుజం, మోకాలి గాయంతో ఇతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ అత‌ని ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నామ‌ని ఎన్‌సీఏ తెలిపింది. ఆస్ట్రేలియా టూర్‌కు నెట్ బౌల‌ర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్ల‌లోనూ అరంగేట్రం చేసి.. అద్భుతంగా రాణించాడు నటరాజన్. ఐపీఎల్‌లో అదరగొట్టిన స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తిని దురదృష్టం వెంటాడుతోంది. గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైన అతడు… ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతడు జట్టుకు దూరంకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇతడి స్థానంలో రాహుల్‌ చాహర్‌కు అవకాశం దక్కొచ్చు. ఇక గత ఐపీఎల్‌ సిరీస్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌లో మెరిసిన రాహుల్‌ తెవాటియా కూడా ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడికి త్వరలో మరోసారి టెస్ట్ నిర్వహించనున్నారు.