ఏపీకి $ 3 బిలియన్ల డాలర్లు..AIIB బ్యాంకు నిర్ణయం

ఏపీ ప్రభుత్వానికి సహాయం చేయాలని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB) నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ. 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం సీఎం జగన్‌తో AIIB ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. నిర్ణయించుకున్న ప్రాధాన్యతల ప్రకారం డబ్బులను ఖర్చు చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పోర్టులు, ఏయిర్ పోర్టులు, ఇరిగేషన్, రోడ్లు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమలను AIIB ప్రతినిధులకు సీఎం జగన్ వివరించారు. నవరత్నాలతో సహా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వెల్లడించారు. నాడు – నేడు కార్యక్రమంపై బ్యాంకు ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్ మీద పెట్టుబడులుగా అభివర్ణించారు. ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను ప్రతినిధులు ఆహ్వానించారు.
కానీ ఇటీవలే AIIB బ్యాంకు రుణంపై ప్రచారం జరిగింది. రుణం ఇవ్వలేమని..వెనుకంజ వేసిందనే వార్తలు వెలువడ్డాయి. అమరావతికి రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిన నేపథ్యంలో..తాము కూడా 200 మిలియన్ డాలర్లు రుణ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఏఐఐబీ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వైసీపీ నిర్వాకం వల్లే..రాజధాని ప్రాజెక్టు రుణాలు వెనక్కిపోతున్నాయని ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.
అయితే… మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కోట్ల రూపాయలు ఒక్కదగ్గరే కేంద్రీకరించడం సబబు కాదని, ఏపీ రాష్ట్రం అంత డబ్బు పెట్టలేని స్థితిలో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. దీనిని అమరావతి ప్రజలు వ్యతిరేకించారు. టీడీపీ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. గత 50 రోజులకు పైగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని అంశం రాష్ట్ పరిధిలోనేదే అంటూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. తాజాగా AIIB బ్యాంకు చేసిన ప్రకటనపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.