Amaravati : నేడు అమరావతి రైతుల సభ..రేపు రాయలసీమ మేధావుల ఫోరం బహిరంగసభ

అమరావతి రైతుల సభకు.. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రజాసంఘాలన్నింటిని ఆహ్వానించారు...రాయలసీమ మేధావుల ఫోరం 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం మరో సభ...

Amaravati : నేడు అమరావతి రైతుల సభ..రేపు రాయలసీమ మేధావుల ఫోరం బహిరంగసభ

Tpt

Updated On : December 17, 2021 / 7:26 AM IST

Amaravati Farmers Meeting : తిరుపతిలో.. అమరావతి రైతుల బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేణిగుంట సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో.. స్పెషల్ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, సభకు వచ్చే వారికి భోజన ఏర్పాట్లతో.. సర్వం సిద్ధం చేశారు. 2021, డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. అమరావతి జేఏసీ నేతలు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేలా.. సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలకు లోబడి సభ నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

Read More : Bigg Boss 5 : నువ్వేమన్నా హీరోవి అనుకుంటున్నావా?.. సన్నీని ఏకిపారేసిన సిరి

అమరావతి రైతుల సభకు.. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రజాసంఘాలన్నింటిని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌ బాబు, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు. అమరావతి రైతుల సభకు పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. ఈ సభ విజయవంతం అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ముందు అనుమతివ్వలేదు. దీంతో.. అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సభకు కొన్ని ఆంక్షలు పెట్టింది.

Read More : BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్…క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

తిరుపతిలో జరగబోయేది రైతుల సభ కాదని.. రాజకీయ సభ అని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న వాళ్లంతా.. టీడీపీ వాళ్లేనని చెప్పారు. 3 ప్రాంతాల అభివృద్ధే తమ విధానమని.. దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం నిర్వహించే సభతో.. తమకెలాంటి సంబంధం లేదన్నారు బొత్స. ఇటు మంత్రి సీదిరి అప్పలరాజు మూడు రాజధానుల ఏర్పాటుపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో పెద్ద ఉద్యమం జరగాల్సి ఉందన్నారాయన. ఉత్తరాంధ్రలో మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల కోసం ఉద్యమిస్తారని అప్పలరాజు తెలిపారు.

Read More : TS Inter Results : ఇంటర్ విద్యార్థి షాకింగ్ ట్వీట్.. నా చావుకు కారణం ఆ ఇద్దరు మంత్రులే

మరోవైపు అమరావతి రైతుల సభకు పోటీగా.. రాయలసీమ మేధావుల ఫోరం 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం మరో సభ నిర్వహించనుంది. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. 3 రాజధానులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ సభను నిర్వహించనున్నారు. గురువారమే రాయలసీమ మేధావుల ఫోరం.. తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించింది. కృష్ణాపురం నుంచి మున్సిపల్ ఆఫీస్ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో.. మేధావుల ఫోరం సభ్యులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 3 రాజధానులతోనే.. రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. కర్నూలులో హైకోర్టు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించే అభివృద్ధి వికేంద్రీకరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.