రాజధాని రణం : 7వ రోజు..హోరెత్తుతున్న రైతుల ఆందోళనలు

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 07:50 AM IST
రాజధాని రణం : 7వ రోజు..హోరెత్తుతున్న రైతుల ఆందోళనలు

Updated On : December 24, 2019 / 7:50 AM IST

రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఏడోరోజు అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కృష్ణాయపాలెం, తాడికొండ మండలం మోతడకలో…  రైతులు వంటావార్పు మొదలెట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు హోరెత్తుతుండగా… కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను పలుచోట్ల  ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. 

వినూత్న రీతిలో నిరసనలు : –
వినూత్న రీతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందంటూ కొందరు కాళ్లకు బదులు చెప్పులు వేసుకుని నిరసన తెలపగా.. మరికొందరు నల్లదుస్తులతో ధర్నా నిర్వహించారు. ఇంకొందరు కళ్లకు గంతలు కట్టుకుని, రాజధాని ప్రాంత మట్టి ప్యాకెట్లను మెడలో వేసుకుని నిరసన తెలిపారు.
తుళ్లూరులో ధర్నాకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

టెంట్లను తొలగించడంతో ఉద్రిక్తత :-
మంగళవారం వేకువజామున టెంట్లు వేసేందుకు రైతులు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. టెంట్లను తొలగించాల్సిందేనని ఒత్తిడితెచ్చారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత తలెత్తింది. 

వెంకయ్య నాయుడు దృష్టికి : –
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నారు రాజధాని రైతులు. గన్నవరం మండలం అత్కూర్‌లో వెంకయ్యను కలిసి..  రాజధాని మార్పు అంశంపై వినతిపత్రం ఇవ్వనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌తోనూ భేటీ అవుతారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరనున్నారు.
 

రైతుల ఆందోళనకు అడ్వకేట్స్ మద్దతు :-
మరోవైపు.. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు హైకోర్టు న్యాయవాదులు కూడా మద్దతు ప్రకటించారు. రైతులకు సంఘీభావంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఛలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ లాయర్లంతా హైకోర్టు దగ్గర నిరసన తెలపనున్నారు. 

కన్నాతో రాజధాని రైతులు :-
ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి కలిసిన రాజధాని గ్రామాల రైతులు… ఈ ఇష్యూపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలని కోరారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసినచోటే కేపిటల్‌ కొనసాగేలా చూడాలని కోరారు. మొత్తానికి రాజధాని అంశం హీట్ పుట్టిస్తోంది. 

Read More : పోటాపోటీ : బాబు కనిపించడం లేదు..పీఎస్‌లో కంప్లయింట్