కొణతాలకు లక్కీ ఛాన్స్ .. పీలా గోవింద్, దాడి వర్గం సహకరిస్తుందా?

టీడీపీ - జనసేన కూటమి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయనకు పీలా గోవింద్ వర్గం, దాడి వర్గం ఏమేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

కొణతాలకు లక్కీ ఛాన్స్ .. పీలా గోవింద్, దాడి వర్గం సహకరిస్తుందా?

Konathala Ramakrishna

Konathala Ramakrishna : టీడీపీ, జనసేన మొదటి లిస్ట్ ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి ఎలా ఉన్నా.. జనసేన శ్రేణులకు మాత్రం షాకిచ్చింది. అందరినీ కాదని కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటిచ్చి లిస్ట్ లోనే ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో జనసేన నుంచి ఆశించిన వారి పేర్లు కంటే ఎవ్వరూ ఊహించని పేరు బయటకు రావడంతో నేతలంతా అవాక్కయ్యారు. ముందుగా అనకాపల్లి ఎంపీ సీటుకు తానే పోటీ చేస్తానంటూ కొణతాల భావించారు. కానీ, మధ్యలో నాగబాబు ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటును కొణతాల పేరును ప్రకటించారు పవన్ కల్యాణ్.

Also Read : చంద్రబాబుతో చర్చల తర్వాత తేలనున్న గంటా శ్రీనివాసరావు భవిష్యత్‌

పీలా గోవింద్ వర్గం సహకరిస్తుందా?
అనకాపల్లి సీటు విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కొణతాల ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతోనూ చర్చించారు. మొత్తానికి పవన్ కల్యాణ్ చర్చలు ఫలించడంతో కొణతాలకు అనకాపల్లి సీటు ఖరారైంది. కానీ, ఈ జాబితాలో నాగబాబు పేరును ఇంకా ప్రకటించలేదు. మొత్తంమీద అలకబూనిన కొణతాలకు సీటు రావడంతో ఇటు జనసేన, టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గం సీటు కణతాలకు కేటాయించడతో ఇప్పటికే పీలా గోవింద్ వర్గం భగ్గుమంది. గోవింద్ వెంటేనే టీడీపీ అంటూ హుకుం జారీ చేశారు పార్టీ కార్యకర్తలు. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా గెలిపించుకుంటామంటూ సవాల్ విసురుతున్నారు. ఎప్పటినుంచో ఆ సీటు నాదే అంటూవచ్చిన పీలా గోవింద్ కు గట్టిషాకే ఇది. మరి పీలా వర్గం సహకారం కొణతాలకు ఎంతవరకు ఉంటుంది. అధిష్టానం ఏ విధంగా నచ్చజెబుతుంది. ఆయన వింటారా? కార్యకర్తలు ఏమంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

దాడి వర్గం సహకరిస్తుందా?
దాడి వీరభద్రరావు వర్గానికి కొణతాల వర్గానికి దశాబ్దకాలంగా విబేధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దాడి వర్గానికి కొణతాల వర్గానికి దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విబేధాలు ఉన్నాయి. ఇద్దరూ ప్రత్యర్థులుగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. కానీ, కొణతాలకు దాడి వర్గం సహకారం చేస్తుందా లేదా అనేదికూడా పెద్ద క్వశ్చన్. ఈ ఎన్నికల్లో దాడి కుటుంబం టికెట్ ఆశించినా వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. కొణతాల రామకృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమై చాలాకాలమే అయింది. ఇప్పుడు అనకాపల్లి టికెట్ రావడంతో కొణతాల మళ్లీ చరిత్ర రిపీట్ చేస్తారా? టీడీపీకి చెందిన అదే సామాజికవర్గం నేత పీలా గోవింద్ ఎంత వరకు సహకారం ఇస్తారు? జనసేన అనకాపల్లి సమన్వయకర్త పరుచూరి భాస్కర్ రావు ఏ మేర సహాయసహకారాలు అందిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో గౌవర సమాజిక వర్గం ప్రాతినిధ్యం చాలా బలమైంది. అనకాపల్లిలో గంటా శ్రీనివాస్ రావు ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి గౌవర్ల ప్రాభల్యానికి దెబ్బపడింది. ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాన్ని గంటా మట్టి కరిపించారు. అనకాపల్లిలో పుట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దాడి వీరభద్రరావు, కొణతాలను సవాల్ చేసి మరీ గంటా ఇద్దరినీ ఓడించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొణతాల, టీడీపీ నుంచి దాడి వీరభద్రరావు, ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాస్ రావు లు పోటీ చేశారు. వారిద్దరినీ ఓడించి గంటా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గంటా విజయం సాధించారు. దీంతో దశాబ్దకాలంగా తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందన్న అసంతృప్తి గౌవర్లలో ఎక్కువైంది.