ఏపీలో అన్నదాతలకు బిగ్‌అలర్ట్.. ఇవాళే మీ బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు పడేది.. ఈ ప్రాంతాల్లోని రైతులకు మాత్రం డబ్బులు పడవ్.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.

Annadata Sukhibhava Scheme
Annadata Sukhibhava Scheme: కూటమి ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన తొలి విడత నిధులు ఇవాళ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ‘పీఎం కిసాన్’ పథకం నిధులను మోదీ విడుదల చేస్తారు. దీంతో రాష్ట్రంలోని 46.86లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,174.43 కోట్లు జమకానున్నాయి. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్.. వీరిలో కొంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు పడవ్.. ఎందుకంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వారికి కేవలం పీఎం కిసాన్ పథకం నిధులు రూ.2వేలు మాత్రమే జమ అవుతాయి.
అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని కడప జిల్లాలో పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతోపాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు, రెండు గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీటి పరిధిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమంగా పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేయొచ్చునని సూచించారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే..
ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాలోని కడియపులంక గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో మనీంద్రం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు-1, పల్నాడు జిల్లాలోని కారంపూడి మండలం వేపకంపల్లిలో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా.. కొండపి, కడియపులకం గ్రామ పంచాయతీలు, రామకుప్పం, విడవలూరు, కారంపూడి మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు ఇవాళ పడవు. ఎన్నికల కోడ్ తొలగిపోయిన తరువాత ఆ ప్రాంతాల్లోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ కానున్నాయి.