Ram Gopal Varma : రాంగోపాల్ వర్మకు మరో బిగ్ షాక్.. ఇంకో కేసు నమోదు, విచారణకు రావాలంటూ నోటీసులు
తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గుంటూరు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Ram Gopal Varma
Ram Gopal Varma : దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ కేసులో ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. ఈసారి సీఐడీ పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు.
2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వర్మ తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గుంటూరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు.. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఆర్జీవీకి నోటీసులు అందించారు.
ఈ కేసులో వర్మ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. బీఎన్ఎస్ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదైంది. (ఎఫ్ఐఆర్ నంబర్ 29/2024 (నవంబర్) మంగళగిరి సీఐడీ. U/s 196 {(1) 353(2) r/w 61(2))
Also Read : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?
అటు.. కూటమి నేతలపై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసులో వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు విచారణ అధికారి సీఐ శ్రీకాంత్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లోని తన ఖాతాలో పోస్ట్ చేశారు వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు వర్మ అంగీకరించారట.
వర్మపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు..
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి వర్మపై టీడీపీ కార్యకర్త గతంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులు, కుటుంబసభ్యులపై రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విచారణకు హాజరు కావాలంటూ 41ఏ నోటీసులు జారీ చేశారు. తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్స్ లో వస్తే భారీగా నష్టపోతానంటూ ఆర్జీవీ తెలిపారు. తనకు వారం 10 రోజుల గడువు ఇవ్వాలంటూ నోటీసుల సమయంలో పోలీసులను కోరారు.
Also Read : శని ‘సడేసతి’ వస్తోంది.. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఏ పరిహారం చేయాలంటే?
ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ, వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై పోస్టులు పెట్టారు. పోలీసులు రెండు సార్లు అవకాశం కల్పించినా వర్మ విచారణకు రాలేదు.
పోలీసులు పలుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు ఆర్జీవీ. హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే, విచారణకు సహకరించాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు వర్మ.