మండలి రద్దుకు ఏపీ కేబినెట్ తీర్మానం

అందరూ ఊహించినట్లే జరిగింది. ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ..కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రధాన బిల్లులు ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మొదటిది పాలనా వికేంద్రీకరణకు సంబంధించింది. రెండోది సీఆర్డీఏ రద్దుకు సంబంధించింది. శాసనసభలో వీటికి ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలికి ఈ బిల్లులను పంపించారు.
కానీ మండలిలో రూల్ 71 తీసుకరావడం..టీడీపీ ఎమ్మెల్సీలు దీనికి అనుకూలంగా ఓటింగ్ వేయడంతో వైసీపీ షాక్‌కు గురైంది. చర్చకు అనుమతించకుండానే..సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ బిల్లులను పంపించడాన్ని సీఎం జగన్ తీవ్రంగా పరిగణించింది. విచక్షణాధికారాన్ని ఉపయోగించి..సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగిందని ఛైర్మన్ షరీఫ్ వెల్లడించారు. దీంతో మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మండలి రద్దుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం పొందిన తర్వాత..రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతే..శాసనమండలి రద్దు కానుంది.
శాసన మండలి రద్దు ప్రాసెస్ నెలలో పూర్తి కావొచ్చు.. లేదంటే పదేళ్లు పట్టొచ్చు. ఇంత కాలం అని నిర్దిష్ట గడువేం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
గత చరిత్ర : –
* జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి ఏర్పాటయ్యింది.
* 1983లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
* అసెంబ్లీకి, మండలికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.
* అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో మండలిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 30, 1985న తీర్మానం చేయించారు.
* అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ఆమోదించింది.
* జూన్1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది.
* జనవరి 22, 1990న శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసింది.
* ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అయినా, లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది.
* జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది.
* డిసెంబర్ 15, 2005న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
* డిసెంబర్ 20, 2005న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది.
* జనవరి 10, 2006న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు.
* 1985లో రద్దైన మండలి.. మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది.
* మరోసారి శాసన మండలి రద్దు దిశగా 2020, జనవరి 27వ తేదీ సోమవారం జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది. కేబినెట్ తీర్మానం చేసింది.
Read More : భయంకరమైన వార్త : కోబ్ బ్రయంట్ మృతిపై పలువురు సంతాపం