Pawan Kalyan : కన్నడ గడ్డపై పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం.. ప్రత్యేక బిరుదు అందుకున్న డిప్యూటీ సీఎం..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఆదివారం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో పర్యటించారు..

Pawan Kalyan : కన్నడ గడ్డపై పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం.. ప్రత్యేక బిరుదు అందుకున్న డిప్యూటీ సీఎం..

Pawan Kalyan

Updated On : December 8, 2025 / 8:12 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నెలరోజులుగా జరుగుతున్న లక్షకంఠ గీతాగాన కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభాలతో పవన్ కల్యాణ్‌కు మఠంలోకి స్వాగతం పలికారు. అనంతరం పవన్ కనకన కిండి నుంచి కృష్ణుడిని దర్శించుకున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది.

Pawan Kalyan

కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్‌ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.


ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడారు. తానీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిగానో, ప్రజా సేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయ పూర్వక సాధకుడిగానే వచ్చానని అన్నారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్య నిజమైన నాయకత్వానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడి లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమి తమయ్యామని వివరించారు.

భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందని తెలిపారు.

నేటితరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొంటోందని, వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుందని పేర్కొన్నారు. మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు లేదా సంపదతో కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని పవన్ అన్నా రు.

సంస్కృతి కోసం స్వరాన్ని పెంచాలని తన విశ్వాసం నేర్పుతోందని, ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారనడం కంటే ముందు మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని పవన్ అన్నారు. ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడంకోసం అక్కడివారు న్యాయపోరాటాలు చేయాల్సి వస్తోందని పవన్ పేర్కొన్నారు.