పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్న స్థలం ఇదే.. ఎవరి దగ్గర కొన్నారంటే..?
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్న స్థలం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర నుంచి కొన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు.

AP Deputy CM Pawan Kalyan Pithapuram Land full details
Pawan Kalyan Pithapuram Land Details: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలం కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వారాహి సభలో బుధవారం వెల్లడించారు. తాను పిఠాపురంలో ఉండనని ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన నిరూపించారు. పిఠాపురంలో ఇల్లు కట్టుకుని తరచూ వస్తుంటానని, క్యాంపు కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ప్రకటనతో పిఠాపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ స్థలం ఎక్కడుంది, ఎవరి దగ్గర నుంచి ఎంతకు కొన్నారని తెలుసుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొన్న స్థలం పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉంది. ఇక్కడ ఎకరం 15 నుంచి 16 లక్షలు రూపాయలు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు.
Also Read : చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం: వైఎస్ జగన్
పవన్ కల్యాణ్ కొన్న స్థలానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఏలేరు కాలువ సమీపంలో ఈ స్థలం ఉందని వడ్లమూడి అప్పారావు అనే స్థానిక రైతు తెలిపారు. కాకినాడ రైతుకు చెందిన 16 ఎకరాల్లో 3 ఎకరాల చిల్లర పవన్ కొన్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇక్కడ స్థలం కొనడం వల్ల పిఠాపురానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, పవన్ స్థలం పక్కన తనకు 11 సెంట్ల స్థలం ఉందని తెలిపారు.