Ration Rice Smuggling : ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణపై సిట్ ఏర్పాటు..
కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది.

Ration Rice Case (Photo Credit : Google)
Ration Rice Smuggling : రేషన్ బియ్యం అక్రమ రవాణపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ఐదుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. వినీత్ బ్రిజ్ లాల్ ను సిట్ చీఫ్ గా నియమించింది. కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది.
కాకినాడ పోర్టులో దొరికిన రేషన్ బియ్యం వ్యవహారంలో నిగ్గు తేల్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో నిజాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. ఐపీఎస్ ఆఫీసర్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో ఉమామహేశ్వర్, అశోక్ వర్దన్, బాలసుందర్ రావు, గోవిందయ్య, రత్తయ్య సభ్యులుగా ఉన్నారు. వీరు డీఎస్పీ కేడర్ అధికారులు. వీరంతా వినీత్ బ్రిజ్ లాల్ కు సహకరించనున్నారు.
బియ్యం అక్రమ రవాణకు సంబంధించి 13 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉన్నత స్థాయి అధికారి బృందం వెంటనే రంగంలోకి దిగాలని, దర్యాఫ్తు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. నెల రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదికను సిట్ అందజేసే అవకాశం ఉంది.
ఎఫ్ఐఆర్ లలో నమోదైన వారిని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాలపై సిట్ దర్యాఫ్తు చేయనుంది. అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. సిట్ బృందం ఇచ్చే దర్యాఫ్తు నివేదికను ప్రభుత్వం కోర్టుకు సబ్మిట్ చేయనుంది. బియ్యం అక్రమ రవాణపై చర్యలు తీసుకోనుంది. బియ్యం అక్రమ రవాణను పూర్తి స్థాయిలో అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Also Read : ఓవైపు యాపారం, మరోవైపు అడ్డగోలు వ్యవహారం..? బియ్యం దందాపై కూపీ లాగితే డొంక కదిలిందా?