మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..
3 నుంచి 4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

Mega DSC (Photo Credit : Google)
Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. రాష్ట్రంలో 16వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. 3 నుంచి 4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహణపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను డీఈవోల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ కూడా విడుదలైంది. ఇక నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత నవంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది ఏపీ సర్కార్.
అటు మెగా డీఎస్సీ విషయంలో ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు డీఎస్సీ అభ్యర్థుల కోసం 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తామన్నారు. మరోవైపు ఉచిత డీఎస్సీ కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే అభ్యర్థుల కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక గదులు, కాన్ఫరెన్స్ హాల్, తరగతి గదులు, రీడింగ్ రూమ్ ఉన్నాయి.
Also Read : కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ బాట.. విడుదల దారెటు..!