Peddireddy Midhun Reddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం..

YSRCP MP Mithun Reddy
Peddireddy Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని ఇవాళ విచారించిన సిట్ అధికారులు.. అనంతరం అరెస్ట్ చేశారు. ఇవాళ విచారణ నిమిత్తం ఆయన విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడున్నర గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని రేపు (జూలై 20) ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం మిథున్ రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల చెల్లింపు తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారు అనేదానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును తరలించిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ అధికారులు గుర్తించారు. మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి 5 కోట్లు మళ్లినట్లు గుర్తించిన అధికారులు.. మద్యం ఉత్పత్తి సంస్థలను మిథున్ రెడ్డి బెదిరించినట్లు తెలిపారు.
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ స్పందించింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ ను ఖండించింది. చంద్రబాబు కక్ష రాజకీయాలకు ఇది పరాకాష్ట అని వైసీపీ నాయకత్వం మండిపడింది. ఈ తరహా చర్యలు ఎల్లకాలం సాగవని హెచ్చరించింది. ఇలాంటి వాటితో పార్టీని కట్టడి చేయలేరని, ప్రజల్లో మా పార్టీ మరింత బలపడుతోందని వైసీపీ అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది.
అటు మద్యం కుంభకోణంపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అందజేశారు సిట్ అధికారులు. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్ షీటులో వెల్లడించారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను దీనికి జతచేశారు.
వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్ మెంట్లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది సిట్. మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్ ను వైట్ గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్