AP: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లో వైఎస్ జగన్ పేరు.. నేడు కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..

YS Jagan
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం విచారించిన సిట్ బృందం… విచారణ అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇవాళ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపర్చనున్నారు. రాత్రంతా ఆయన సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు సిట్ అధికారులు శనివారం రాత్రి నోటీసులిచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పటి వరకు లిక్కర్ స్కాం కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. అయితే, ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు శనివారం సాయంత్రం ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్లో మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. తాజా జాబితాతో లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల సంఖ్య 48మందికి చేరింది. 305 పేజీ ఛార్జ్‌షీట్, 70 అడిషనల్ వాల్యూమ్స్ జత చేసి న్యాయస్థానంలో సమర్పించారు. ఛార్జ్‌షీట్‌కు అదనంగా జత చేసిన వాటిలో లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన జీవోలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, బ్యాంకు స్టేట్మెంట్స్ లు ఉన్నాయి.
సిట్ అధికారులు ఛార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును పలుసార్లు ప్రస్తావించారు. జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. అయితే, ఛార్జ్‌షీట్లో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ప్రస్తావన ఎక్కడ కనిపించలేదు. మరోసారి దాఖలు చేసే ఛార్జ్‌షీట్‌లో వివరాలు పొందుపరుస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఛార్జ్‌షీట్లో తాజాగా యాడ్ చేసిన ఎనిమిది మంది దేశం విడిచి పరారైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డి ఉన్నారు.