బాబు సైంధవుడు : ఏపీ మంత్రుల ఫైర్

  • Published By: madhu ,Published On : January 30, 2020 / 12:49 AM IST
బాబు సైంధవుడు : ఏపీ మంత్రుల ఫైర్

Updated On : January 30, 2020 / 12:49 AM IST

ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మండలి రద్దును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని… చంద్రబాబు ఆస్తుల కోసమే అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంతో పాటు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడంతో రాజకీయ రగడ తీవ్రంగా మారింది. జగన్‌ సర్కార్‌ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును… మంత్రులు లక్ష్యంగా చేసుకున్నారు. మంత్రులతా చంద్రబాబుపై మూకుమ్మడిగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

బాబువి రాజకీయాలు – బొత్స
విశాఖపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులను హైపవర్ కమిటీ పరిశీలించాకే… ప్రభుత్వం మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. తుపాను ముప్పులేకుండా ఏ నగరమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. విపక్ష నేత చంద్రబాబు అభివృద్ధి నిరోధక శక్తిగా మారాడని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఫైరయ్యారు.

బాబు సైంధవుడు – కన్నబాబు
అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తుంటే… చంద్రబాబు సైంధవుడిలా ప్రతీ దానికి అడ్డుపడుతున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. తన వారిని, ఆస్తులను కాపాడుకోవడానికి కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

మండలి రద్దుకు బాబు విశ్వప్రయత్నాలు – మోపిదేవి
మరోవైపు మండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. తమ ల్యాండ్ బ్యాంక్‌కు నష్టం జరుగుతుందనే మూడు రాజధానుల్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.