Papikondalu Tourism : పాపికొండల్లో బోటు ప్రయాణం.. త్వరలో పచ్చజెండా!
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Ap Tourism Gears Up To Resume Boat Services To Papikondalu From June End
AP Papikondalu Tourism : ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి రమణీయమైన సుందరప్రదేశం పాపికొండలు.. ఇక్కడి పచ్చని అందాలను తిలకించి పర్యాటకులు పులకించిపోతుంటారు. గోదావరి సెలయేరు సవ్వళ్ళు, పిల్లగాలుల తెమ్మెరల నడమ సాగే బోటు ప్రయాణం అనుభూతే వేరు… ఇలాంటి సుందర ప్రదేశం ఏడాదిన్నరకు పైగా పర్యాటకుల పాదాలతాకిడికి నోచుకోక బావురుమంటోంది. కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 51 మంది జలసమాధి ఘటన ఇంకా పర్యాటకుల కళ్లముందు మెదులుతూనే ఉంది. అప్పటినుంచి బోట్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది.
పర్యాటకాన్నే నమ్ముకున్న అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఏడాది తరువాత గత ఏప్రిల్ నెలలో తిరిగి పాపికొండలకు పర్యాటకులను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భావించింది. అప్పటికే కొవిడ్ రెండవ దశ ప్రారంభమైంది. ఈ క్రమంలో పాపికొండలకు బోటు ప్రయాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గతంలో చోటు చేసుకున్న ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా, ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ కఠిన తరమైన నిబంధనలు అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు టూరిజం అధికారులు. అంతాసవ్యంగా జరిగితే జులై తొలివారం నుండి తిరిగి పాపికొండలు పర్యాటక ప్రాంతానికి బోటు ప్రయాణాలను ప్రారంభించాలన్న యోచన చేస్తున్నారు. బోటు ప్రయాణాలు సురక్షితంగా సాగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సింగన్నపల్లి, పేరంటాలపల్లిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.
పోలీస్, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఈ కంట్రోల్ రూమ్ లను మానిటరింగ్ చేస్తారు. బోట్ లో ప్రయాణికులకు లైఫ్ జాకెట్ తప్పనిసరి చేయటం, సిసి కెమెరాలు అమర్చటం , బోట్లకు లొకేషన్ ట్రాకర్లు అమర్చటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో పాపికొండలు పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.